Education News : పది, ఇంటర్, డిగ్రీ వార్షిక పరీక్షలకు తోడు ప్రవేశ పరీక్షల తేదీలు కూడా వచ్చేశాయ్. దీంతో రానున్నది అంతా విద్యార్థులకు పరీక్షా కాలం. ఈ నేపథ్యంలో కోరుకున్న విద్యాసంస్థలు, కోర్సుల్లో చేరాలనేది ప్రతి విద్యార్థి లక్ష్యం, ఇందుకు సన్నద్ధమవడమే అత్యంత కీలకం. ఇందుకు ఓ వైపు వార్షిక, మరోవైపు ప్రవేశ పరీక్షల్లో రాణించేందుకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు సమాయత్తమవ్వాలి. వీటిలో వార్షిక పరీక్షల పాఠ్యాంశాల కంటే అర్హత పరీక్ష కొంత భిన్నంగా ఉంటుంది. అభిరుచి గల కోర్సు, ఆసక్తిగల కళాశాలలో సీటు దక్కాలంటే ఆ మాత్రం శ్రమించక తప్పదు. అప్పుడే మీరు కలలు కన్న కల సాకారం అవుతుంది. కానీ పోటీ పరీక్షల్లో సరైన సమయంలో సరైన సమాధానం గుర్తించిన వారే విజేతలుగా నిలుస్తారనే విషయం తెలుసుకోవాలి.
ఇలా చేస్తే ప్రయోజనం :
- ముందుగా ప్రతి అంశంపై పట్టు సాధించేలా చదవాలి.
- వాటిలో అర్థం కానివి, పూర్తిగా కఠినమైనవి వదిలి, మిగతా అంశాలను వందశాతం అర్థవంతంగా చదవాలి.
- రోజులు గడుస్తుంటే పరీక్ష సమీపిస్తుందనే భయం ఉంటుంది.
- సిలబస్ ప్రకారం మొత్తం అంశాలపై ఒక అవగాహన వచ్చిన తర్వాత పునఃశ్ఛరణ, పరీక్ష సాధన వంటివి ఒక క్రమపద్ధతిలో అనుసరించాలి.
ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి :
- ఉదయం 5గంటలకు నిద్రలేచి టీ, అల్పాహారం.
- 6 నుంచి 7 గంటల వరకు గతరాత్రి చదివిన అంశాల పునశ్ఛరణ.
- 7 నుంచి 10 వరకు కఠిన అంశాల పఠనం, సాధన.
- 10 నుంచి 12 వరకు బృందచర్చలు.
- 12 నుంచి 1 గంట వరకు భోజన విరామం.
- 1 నుంచి 3 వరకు సందేహాల నివృత్తి, అనుభవజ్ఞుల సలహాలు స్వీకరణ, నిపుణుల శిక్షణ.
- 3 నుంచి 6 దాకా గత పరీక్షల ప్రశ్నపత్రాలు, మాదిరి పరీక్షల సాధన.
- 6నుంచి పది వరకు అప్పటివరకు చదివిన అంశాల మననం.
- 10నుంచి 11గంటల వరకు పఠనం.
ఈ అంశాలు కీలకమే మరి :
- కొన్ని ప్రవేశాల పరీక్షల్లో మినహా విధిగా జనరల్ నాలెడ్జిని పరీక్షిస్తారు. అందుకే అభ్యర్థులు గత ప్రశ్నాపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిపై ఒక అంచనాకు రావడం మంచిది.
- ఇటీవల కాలంలో పోటీ పరీక్షల్లో ఒక మార్కు కోసం నాలుగు సమాధానాలు గుర్తించాల్సి వస్తుంది. దానర్థం జతపరచండి అనే ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఎక్కువ ప్రశ్నలు తక్కువ మార్కులు అనే విషయాన్ని గుర్తించుకోవాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన, అంతర్జాతీయ సదస్సులు, రాజ్యాంగ సవరణలు, తెలంగాణ ఏర్పడింది మొదలు, ప్రభుత్వ విధానాలు, వర్తమాన అంశాల్లో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గుర్తించాలి.
- అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలు అధిక సమయాన్ని తీసుకుంటే మిగతా వాటికి సమాధానాలు గుర్తించే అవకాశాన్ని కోల్పోతారు. అందుకే సమయ నిర్వహణ ఎంతో కీలకమైనది. ఎలాంటి ఆందోళన ఉండకుండా ప్రశాంతంగా ఉంటూ సరైన నిద్ర, ఆహారం తీసుకుంటే మంచిది. వీటి విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు.
జాబ్ కొట్టాలంటే మార్కులే ఉండాలా ఏంటి? - HR నిపుణులు ఏం చెబుతున్నారంటే? - Job Getting Skills
టెన్త్, ఐటీఐ అర్హతతో - రైల్వేలో 32,438 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్