కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పీహెచ్సీ ఎదుట.. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయడం లేదంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి వేచి ఉన్నా.. ఒక్కరికీ టెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొవిడ్ విజృంభణ నేపథ్యంలో.. పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మరో రెండు చోట్ల వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో కేంద్రంలో కేవలం 100 మందికి మాత్రమే టెస్టులు జరుపుతున్నారు. మిగతా వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పొద్దంతా ఎండలో వేచి ఉంటూ అవస్థలు పడుతున్నా.. వైద్య సిబ్బంది తమపై కనికరం చూపడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు.
రోజురోజుకూ ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరగడం, సిబ్బంది కొరత వల్ల ఎక్కువ మందికి పరీక్షలు చేయలేకపోతున్నామని ఆయా కేంద్రాల వైద్య సిబ్బంది తెలుపుతున్నారు. దాంతో పాటు కచ్చితమైన లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. స్వల్ప లక్షణాలు కలిగిన వారికి టెస్టులు చేయడం లేదంటున్నారు.
ఇదీ చదవండి: ఆందోళన చెందొద్దు.. అనుమాన పడొద్దు...