Covid Vaccination: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బి.గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సాయి స్ఫూర్తి డీఏవీ పాఠశాలలో జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 15 నుంచి 18 ఏళ్లు ఉన్న మొత్తం 118 మంది కొవాగ్జిన్ టీకాలను వేయించుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని అవగాహన కల్పిస్తూ, వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను తెలియజేసే నమూనాను ప్రదర్శించారు. 'వుయ్ గాట్ వ్యాక్సినేటెడ్' , 'గో ఒమిక్రాన్ గో' అంటూ ఉత్సాహంగా నినాదాలు ఇస్తూ మానవహార ప్రదర్శన చేసి, తమ ఆత్మ విశ్వాసాన్ని విద్యార్థులు ప్రకటించారు.
విద్యార్థులు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని, కరోనా విపత్కర పరిస్థితుల్లో టీకా సంజీవని వంటిదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్ కిరణ్కుమార్ పేర్కొన్నారు. టీకా వేయించుకోవడానికి అర్హులైన విద్యార్థులందరికీ అవగాహన కలిగించేందుకు ఈ మానవహార ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక చైతన్యం కలిగించే విషయాలను విస్తృతపరచడంలో డీఏవీ విద్యాసంస్థలు ఎప్పుడూ ముందుంటాయని డీఏవీ తెలంగాణ జోన్ రీజినల్ డైరెక్టర్ వీఎన్ఎన్కే శేషాద్రి తెలిపారు.
వ్యాక్సిన్ వేయించుకున్న విద్యార్థులను అభినందిస్తూ.. వారి సామాజిక స్పృహను హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, సాయి స్ఫూర్తి డీఏవీ స్కూల్ ఛైర్మన్ దాసరి ప్రభాకర్ రెడ్డి, తదితరులు కొనియాడారు.
ఇదీ చదవండి: