Man Dies Due To Online Betting Apps : సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఆన్లైన్ గేమ్‌లకు బానిసగా మారిన ఓ వ్యక్తి రూ.కోట్లలో తెలిసిన వారివద్ద అప్పులు చేశాడు. చివరికి భూములు, ప్లాట్లు అమ్మినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. దీంతో అతడి స్వగ్రామం కోస్గిలో విషాదం చోటుచేసుకుంది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లో పెట్టి సర్వం కోల్పోయి : కోస్గి మున్సిపాలిటీ పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుడిసె వెంకటయ్య(42) కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చి ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల డాక్టరేట్ పట్టాను కూడా పొందాడు. ఈ క్రమంలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఆన్లైన్ ప్రకటనలు చూసి వెంకటయ్య ఆకర్షితుడయ్యాడు.
ఈజీ మనీ కోసం ఆన్లైన్ రమ్మీతో పాటు పలు రకాల బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టాడు. డబ్బులు పోగొట్టుకుంటున్నా ఆన్లైన్ గేమ్‌లకు బానిస కావడంతో వడ్డీ వ్యాపారులు, బంధువులు, స్నేహితుల వద్ద రూ.లక్షల్లో అప్పులు చేసి నష్టపోయాడు. అప్పుల బాధ భరించలేక గతేడాది భార్యాపిల్లలతో స్వగ్రామానికి వచ్చాడు. కోస్గిలో ఓ అద్దె ఇంట్లో భార్యాపిల్లలతో నివాసం ఉంటుండగా ఆయన భార్య స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా చేరింది.
అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై : ఈ క్రమంలో వెంకటయ్య స్వగ్రామంలో కూడా మళ్లీ అప్పులు చేసి ఆన్లైన్ గేమ్స్ ఆడి భారీస్థాయిలో సొమ్మును పోగొట్టుకున్నాడు. రోజురోజుకూ అప్పులు పెరగడంతో వాటిని తీర్చేందుకు సొంత గ్రామంలో తన వాటాగా వచ్చిన వ్యవసాయ భూమితో పాటు ప్లాట్లను అమ్మి దాదాపు కోటి రూపాయల అప్పు తీర్చాడు. అయినా కట్టాల్సిన మొత్తం ఇంకా సగం ఉండటంతో మనస్తాపానికి గురయ్యాడు.
గురువారం భార్యాపిల్లలు నిద్రపోయిన తర్వాత అద్దెకు ఉంటున్న ఇంట్లో అర్ధరాత్రి ఉరేసుకొని వెంకటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్రలేచేసరికి భర్త ఉరేసుకున్న దృశ్యాన్ని చూసి రోదిస్తూ భార్య కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న వారు స్థానిక ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించగా వెంకటయ్య అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య షాలిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వెంకటయ్యకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
"గత ఏడాది నుంచి సిటీలో ఉన్నాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు. వారి ఫ్రెండ్స్ కొంతమంది మాటలు విని షేర్ మార్కెట్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మి పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. మేము వాటి గురించి ఎంత అడిగినా చెప్పేవాడు కాదు. ఆన్లైన్లో పెట్టేందుకు బయటవాళ్లు దగ్గర డబ్బులు తీసుకున్నానని చెప్పాడు. వారి నుంచి ఒత్తిడి ఎక్కువయిందని చెప్పాడు. ఆయనకు శాలరీ 70వేల నుంచి 1 లక్షవరకు వచ్చేది. ఇటీవలే ప్రమోషన్ కూడా వచ్చిందని తెలిసింది. అవి సరిపోవట్లేదని ఇలా చేసుకున్నాడు" - మొగులయ్య, తమ్ముడు
ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసైన మిషన్ భగీరథ ఏఈ - వర్క్ ఆర్డర్ల పేరుతో రూ.8 కోట్లు స్వాహా
సరదాగా ఫోన్ పట్టాడు - నెమ్మదిగా బెట్టింగ్‌కు బానిసయ్యాడు - చివరికి?