Tips to Reduce Air Pollution in Kitchen : కిచెన్‌లో వంట చేసే క్రమంలో వెలువడే కొన్ని వాయువులు పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ముప్పు తెచ్చిపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే.. వంట చేసే క్రమంలో చిన్న చిన్న జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత పెట్టడం మర్చిపోవద్దు!
వంట చేసే క్రమంలో కొంతమంది గిన్నెలపై మూత పెట్టరు. మరి కొందరు సగం వరకే పెట్టి వదిలేస్తారు. ఇది వంట ఆలస్యమవడానికి, అధిక పొగ వెలువడడానికి కారణమవుతుంది. మూత పెట్టకుండా వండుకోవడం వల్ల 20 శాతం అదనంగా ఇంధనం వాడాల్సి వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతిసారీ వండే క్రమంలో గిన్నెలపై మూత పెట్టండి.
చిన్న ముక్కలుగా కట్ చేయండి :
ఓపిక లేకో, టైమ్ సరిపోకో.. కొందరు కాయగూరల్ని పెద్ద పెద్ద ముక్కలుగా తరుగుతుంటారు. వంటింటి వాతావరణం కలుషితమవడానికి ఇదీ ఓ కారణమవుతుంది. ఎందుకంటే పెద్ద ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైమ్ పడుతుంది.. అలాగే గ్యాస్ కూడా వృథా! అదే చిన్న ముక్కలుగా కట్ చేస్తే.. ఫాస్ట్‌గా ఉడికిపోతాయి.. కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇంకా కర్రీలు రుచిగా ఉంటాయి.
పెద్ద గిన్నెలు :
కొంతమంది స్టౌపై చిన్న గిన్నెల్ని ఉపయోగిస్తుంటారు. దీనివల్ల స్టౌ వెలిగించినప్పుడు మంట.. గిన్నె అడుగు భాగం దాటి పక్కకు రావడం మనం గమనించవచ్చు. దీంతో ఇంధనం వృథా అవడంతోపాటు, కిచెన్‌లో కాలుష్యం పెరగుతుందట. ఇలా జరగకూడదంటే పెద్ద గిన్నెలు ఉపయోగించడం, చిన్న పాత్రల కోసం ఇండక్షన్ స్టౌ ఉపయోగించడం.. వంటివి చక్కటి ప్రత్యామ్నాయం. అంతేకాదు.. వీటి వల్ల వంటింట్లో వేడి కూడా తక్కువగా ఉత్పత్తవుతుంది.
ఎలక్ట్రానిక్ కెటిల్ వాడండి :
కొందరు కాయగూరలు త్వరగా ఉడకాలన్న ఉద్దేశంతో.. ముందు వాటిని వాటర్‌లో వేసి ఉడికించడం, అవసరం ఉన్నా, లేకపోయినా నీళ్లు వేడి చేయడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల కూడా అటు గ్యాస్ వృథా అవుతుంది, అలాగే వాయువులు కూడా వెలువడతాయి. ఇంకా ఈ ప్రక్రియ వల్ల కాయగూరల్లోని పోషకాలూ నశిస్తాయి. అలా జరగకూడదంటే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వండుకోవడం మంచిది. అలాగే వాటర్ మరిగించడానికి ఎలక్ట్రానిక్ కెటిల్ చక్కటి ప్రత్యామ్నాయం.
కంపోస్ట్ ఎరువుగా :
వంటింట్లో పోగయ్యే తడి చెత్త కూడా వాతావరణ కాలుష్యానికి ఓ కారకం. అయితే ఈ వృథాతో పాటు కుళ్లిపోయిన కాయగూరలు/పండ్లు, వాడిన కాఫీ/టీ పొడి పిప్పి, టీబ్యాగ్స్, కోడిగుడ్డు పెంకులు.. వంటివన్నీ కలిపి కంపోస్ట్ ఎరువుగా మార్చండి. దీనివల్ల అటు కాలుష్యం తగ్గుతుంది.. ఇటు దీన్ని ఇంట్లో పెంచుకునే మొక్కలకు ఎరువుగా కూడా ఉపయోగించచ్చు.
నో ప్లాస్టిక్!
ప్రస్తుత కాలంలో ఎవరి వంటింట్లో చూసినా ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. కాయగూరలు, నిత్యావసరాలు తీసుకురావడానికీ ఎక్కువమంది ప్లాస్టిక్ సంచుల్నే ఉపయోగిస్తున్నారు. వీటికి బదులుగా క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించండి. అలాగే నిత్యావసరాల్ని గాజు/స్టీల్/సిలికాన్‌తో తయారుచేసిన డబ్బాల్లో భద్రపరచుకోండి.
ఇంట్లో డస్ట్ బిన్ నుంచి కంపు వాసనా? - ఇలా చేస్తే సువాసన వెదజల్లుతుంది!
కిచెన్‌లో మీ పని ఈజీ చేసే చిట్కాలు - ఇవి పాటిస్తే మాస్టర్ చెఫ్ ఇక మీరే!