కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వార్షిక తనిఖీపై ప్రజావేదిక నిర్వహించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ఉపాధి హామీ పథకం పనుల నివేదికలను తనిఖీ చేశారు. ముందుగానే అధికారులు ప్రకటించిన ప్రజా వేదికకు ప్రచారం చేయకపోవడం వల్ల ప్రజలు ఎవరూ హాజరుకాలేదు. కేవలం ఆడిట్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు.
గత ఏడాది చేపట్టిన ఉపాధి హామీ పనులపై ఆడిటర్ల అభ్యంతరాలను వేదికపై ప్రకటించి క్రమశిక్షణ చర్యలకు అధికారులు సిఫార్సు చేశారు. ఇప్పటి వరకు 11 విడతలుగా నిర్వహించిన సామాజిక తనిఖీలో రామడుగు మండలంలో రూ. 11 లక్షలు నిధులు మంజూరు చేశామని ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర రావు వెల్లడించారు. 12 విడతగాను రూ. 2 కోట్ల నిధులతో ఉపాధిహామీ పనులు చేపట్టినట్టు వెల్లిడించారు. దీనిపై సామాజిక తనిఖీలో వెల్లడైన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం పనుల్లో జాప్యం చోటు చేసుకోవడంపై అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ మంజులాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కూలీల అందరికీ వంద రోజులు పని కల్పించే లక్ష్యంగా పనులు చేపట్టని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హరిత హారంలో నాటిన మొక్కలు ఎండిపోయిన స్థలాల్లో కొత్త మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం చూపితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండిః వరుస రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యమే కారణమా?