ప్రభుత్వ సూచన మేరకు సన్నరకం వరి పండించిన రైతులను నట్టేట ముంచారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలోని గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్లో నవంబర్ 17న ఫర్నిచర్ ధ్వంసం చేసిన కేసులో మేడిపల్లి సత్యంతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టు అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు కోరగా... మార్కెట్ యార్డును సందర్శించామని మేడిపల్లి సత్యం తెలిపారు. సన్న రకం ధాన్యానికి రూ.2500 చెల్లించడం లేదని రైతులు ఆవేదన చెందారన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించాలని రైతులతో కలిసి ఆందోళన చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లభిస్తుందన్న అక్కసుతో... తెరాస నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతో తమపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని స్పష్టం చేశారు.