జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల మండలమైన పలిమెలలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి పర్యటించారు. అటవీ గ్రామాల గిరిజన ప్రజలకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. పదిరోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలిమెల మండలంలోని మోదేడు గిరిజన గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడం వల్ల సమాచారం తెలుసుకున్న వారు ట్రాక్టర్, ఎడ్లబండిపై వాగులు, వంకలు దాటుతూ అక్కడికి చేరుకున్నారు. అక్కడి గిరిజన ప్రజలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
వచ్చే వర్షాకాలం నాటికి రోడ్డు రవాణా వ్యవస్థను పునరుద్ధరించి బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అన్నారు. గతంలో పరిపాలించిన నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మోదేడు గ్రామాన్ని గుర్తించి అక్కడి సమస్యలను తెలుసుకొని విద్యుత్ సదుపాయం, రోడ్డు మార్గం ఏర్పాటు చేశామన్నారు. మోదేడు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే తెరాస సర్కారు సహాయ సహకారాలు అందజేస్తోందని పుట్ట మధు అన్నారు.
ఇవీ చూడండి: మానవ తప్పిదం వల్లే శ్రీశైలం ప్రమాదం: తమ్మినేని వీరభద్రం