నిజంగా వ్యవసాయం చేసి ధాన్యం అమ్ముకున్న రైతుల సొమ్ము బినామీల ఖాతాల్లో ఎలా జమ అవుతుందని భూపాలపల్లి డీసీవో కార్యాలయ సీనియర్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.. తాడిచర్ల పీఏసీఎస్ సిబ్బందిపై మండిపడ్డారు.
రబీ సిజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని తాడిచర్ల పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేశారు. ఆ ధాన్యం అమ్మగా వచ్చిన అన్నదాతల సొమ్ము సకాలంలో వారి ఖాతాల్లో చేరక పోగా బినామీ రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పీఏసీఎస్ సిబ్బంది ఖాతాలో భారీగా చేరినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో శనివారం రైతుల సొమ్ముపై సీనియర్ ఇన్స్పెక్టర్, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లుగా తెలిపారు.
రైతుల సొమ్ము గోల్‌మాల్‌పై సంబంధిత రైతులు పలువురు పీఏసీఎస్ డైరెక్టర్‌లు, సిబ్బందిని నిలదీయగా సీఈవో శ్రీకాంత్, సిబ్బంది కిరణ్, రవి పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో సీనియర్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా బాధ్యతారహితంగా సమాధానం చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించిన ప్రతి పైసాపై వారు ముగ్గురే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దుర్వినియోగం చేసిన రైతుల సొమ్ము నాలుగైదు రోజుల్లో చెల్లించకుంటే సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. రైతులు అధైర్యపడొద్దని సోసైటీ కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని వేణుగోపాల్ భరోసా ఇచ్చారు. మండలంలో ఎక్కువగా రుద్రారం, తాడిచర్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం సొమ్ము దుర్వినియోగం అయినట్లుగా తేలిందన్నారు. ఈ నెల 21 నుంచి రోజుకు 20 మంది రైతుల సమస్యలను విచారణ చేపట్టి.. తక్షణమే వారి డబ్బు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు