జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్డుకు చెందిన 40 సంవత్సరాల ఓ మహిళ గత పది రోజుల నుంచి జ్వరం తో ఇబ్బందులు పడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా... ఆమెను పరిశీలించిన వైద్యుడు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించారు. పరీక్ష చేయించుకున్న మరుక్షణమే ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే వైద్యులు ఆమెను పరిశీలించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.
పరీక్షలు చేసిన అనంతరం ఆమెకు పాజిటివ్ అని రావడం వల్ల అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆమె కొడుకుతో పాటు పలువురు యువకులు ప్రత్యేక దుస్తులను ధరించి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని ఆస్పత్రి ఆవరణలో పాటు ఆస్పత్రిలోని గదులు అన్నింటిలో పిచికారి చేయించి జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదేమైనా కరోనా పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోవడం వల్ల పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: వెయ్యి రూపాయల కోసం స్నేహితుడినే చంపేశాడు