Woman Murder in Nanakramguda Hyderabad : హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు ఆత్యాచారానికి పాల్పడి అంతమొందించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ నిర్మాణ సంస్థలో ఈ అమానుష ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతురాలిని గౌలిదొడ్డి పరిధిలో నివసించే మహిళగా గుర్తించారు.
కార్పెంటర్ ఘాతుకం.. యువతి తల నరికి.. శరీరాన్ని ముక్కలు చేసి..
Woman Raped and Killed in Hyderabad : గత శుక్రవారం రోజున కాశమ్మ భవనంలోని తుక్కు సామగ్రి తెచ్చుకునేందుకని వెళ్లింది. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం బండరాయితో మోది హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. మృతురాలు శుక్రవారం నుంచి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఆదివారం (ఈ నెల 27న) గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
''ఈరోజు ఉదయం మాకు ఓ ఫోన్ వచ్చింది. విప్రో సర్కిల్ దగ్గర ఉన్న నిర్మాణంలో ఉన్న భవనంలోని సెల్లార్‌లో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లాము. చనిపోయింది వడ్డెర బస్తీకి చెందిన మహిళగా గుర్తించాము. ఆమె ఈ నెల 25వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె కుమార్తె ఈ నెల 27న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే.. ఈరోజు ఈ ఫోన్ వచ్చింది. వచ్చి చూడగా.. చనిపోయింది కాశమ్మగా తేలింది. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. నిందితుల కోసం సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు స్వీకరిస్తున్నాం. హత్యకు గల కారణాలు విచారణ తర్వాత వెల్లడిస్తాం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనేది వెల్లడిస్తాం.'' - జేమ్స్ బాబు, గచ్చిబౌలి సీఐ
నివేదిక కోరిన గవర్నర్..: ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. మహిళ దారుణ హత్య తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి 48 గంటల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సహా.. డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్..: నానక్‌రాంగూడ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిందితులను తక్షణమే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి.. ఘటనపై మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించాలన్నారు.
కారుతో ఢీకొట్టి మహిళ హత్య.. వివాహేతర సంబంధం గురించి తెలిసిందని..