Unemployees Expencess in Study Rooms Hyderabad : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్దేశించిన పరీక్షల వాయిదా(Exams Postpone)తో.. హైదరాబాద్‌లో సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు, ఉద్యోగార్థులు చాలామంది సొంతూళ్లకు పయణమవుతున్నారు. శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections) దృష్ట్యా గ్రూప్-2, టీఆర్‌టీ((TRT) పరీక్షలను నియామక సంస్థలు వాయిదా వేశాయి. ప్రశ్నపత్రాల లీకేజీతో గతంలో ఒకసారి టీఎస్‌పీఎస్సీ(TSPSC) పరీక్షలు రద్దయ్యాయి. రీషెడ్యూలు చేసినప్పటికీ తాజాగా ఎన్నికల పరిణామాలతో వాయిదా పడ్డాయి.
తిరిగి ఈ పరీక్షల నిర్వహణకు మరో రెండు నెలలకు పైగా సమయం ఉండటం, హైదరాబాద్‌లో వసతి ఖర్చులు భరించలేక ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. దీంతో వసతి గృహాలు, స్టడీ సెంటర్లు ఖాళీ అవుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి వస్తామని కొందరు చెబుతున్నారు. పరీక్షల నిర్వహణలో లోపాలు తదితర అంశాలతో నమ్మకం కోల్పోయామని ఇక స్వయం ఉపాధి, వ్యవసాయం చేసుకుంటామని మరికొందరు అంటున్నారు.
నెలకు రూ.12 వేలకు పైనే ఖర్చు : నగరంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నెలకు రూ.12 వేలకు పైగా ఖర్చు అవుతోంది. ఒక్కో వసతి గృహంలో నెలకు రూ.6,500 నుంచి రూ.7,500 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే స్టడీహాల్ కోసం నెలకు రూ.2 వేలు చెల్లించాలి. పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి నెలకు రూ.3 నుంచి 4 వేలకు పైగా అవుతున్నాయి. కొందరు డిగ్రీ పూర్తిచేసి.. మరికొందరు చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి సన్నద్ధమవుతున్నారు.
పరీక్షలు వాయిదా పడటంతో ఇక్కడే ఉంటే ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతాయన్న ఉద్దేశంతో తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారు. అయితే కొందరు అభ్యర్థులు స్నేహితులతో కలిసి అద్దె గదుల్లో ఉంటున్నారు. ఆర్థిక సమస్యలతో తినీతినక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో రూ.5 భోజనంతో సర్దుకుపోతున్నారు. మరికొందరు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తమ స్నేహితులు ఆరుగురు అనారోగ్యంగా ఉందంటూ పరీక్షలు చేయించుకున్నారని ఒక ఉద్యోగార్థి తెలిపాడు. ముగ్గురికి గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇద్దరికి బీపీ సమస్యలు బయటపడ్డాయని పేర్కొ్నాడు. వీరి వయసు 27-30 ఏళ్లలోపు మాత్రమేనని అతను వెల్లడించాడు.
ఏప్రిల్ నుంచి నిరుద్యోగ భృతి.. గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!
"మానాన్న వ్యవసాయం చేస్తారు. నాదీ 2015లో డిగ్రీ పూర్తయింది. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో నెలకు రూ.45 వేల వేతనం లభించేది. 2022లో ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చి సన్నద్ధమయ్యాను. ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై సందిగ్ధం నెలకొంది. ఇక నుంచి ఈ పోటీ పరీక్షలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను." అని నల్గొండ జిల్లాకు చెందిన సాత్విక్ పేర్కొన్నారు.
మానసిక ఆందోళన : గ్రూప్-1 పరీక్ష రెండోసారి జరిగినప్పటికీ హైకోర్టు(Telangana High Court) రద్దు చేయాలని నిర్దేశించింది. దీనిపై టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. కాగా.. ఈ పరీక్షలో అర్హత సాధిస్తామన్న అభ్యర్థుల్లో మానసిక ఆందోళన పెరిగింది. "మా మిత్రుడు గత ఆరేళ్లుగా గ్రూప్-1కు సిద్ధమవుతున్నాడు. తొలిసారి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించాడు. రెండోసారి పరీక్షలోనూ మంచి స్కోరు చేశాడు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కనిపించిన అందరినీ గ్రూప్-1 సంగతి ఏమవుతుందని అడుగుతున్నాడు." అని ఉద్యోగార్థి ప్రకాశ్ తెలిపారు. "మా బంధువు ఒకరు నాతో పాటు అశోక్‌నగర్‌లో పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో కడుపునిండా భోజనం చేయకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడంతో డీహైడ్రేషన్(Dehydration) కారణంగా మెడ నరాల్లో బ్లాక్‌లు ఏర్పడ్డాయి." అని నల్గొండకు చెందిన కార్తీక్ తెలిపారు.
"మాది వ్యవసాయ కుటుంబం. మూడేళ్లుగా గ్రూప్స్‌కు సన్నద్ధమవుతున్నాను. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై నెలకొన్న పరిస్థితులు.. గ్రూప్-2 పరీక్ష రెండుసార్లు వాయిదా పడటంతో ఇక వసతి గృహాన్ని ఖాళీ చేద్దామని నిర్ణయించుకున్నా. పరీక్షలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం మళ్లీ నాకు కుదిరితే హైదరాబాద్‌కు వచ్చి సన్నద్ధమై పరీక్ష రాస్తా.. లేకుంటే ఊళ్లోనే రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటా. ఇక పరీక్షలు జోలికి వెళ్లాను." అని సంగారెడ్డి జిల్లాకు చెందిన పాండు తెలిపారు.
Telangana Teacher Recruitment Exams Postponed : తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు వాయిదా