TSPSC Paper Leakage Scam : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు ఆ కేసులో 50 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఆ సంఖ్య వందకు చేరినా అశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇటీవలే అరెస్ట్ చేసిన విద్యుత్ శాఖ డీఈ రమేశ్ వ్యవహరంలో పోలీసులకి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
TSPSC Paper Leakage Latest Update : కేవలం ఏఈ ప్రశ్నపత్రం విక్రయించడం ద్వారా రమేశ్ కోటి 10 లక్షలు సంపాదిచినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 30 మందికి అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్లు విక్రయించినట్లు సిట్ గుర్తించింది. గతంలో వరంగల్ విద్యుత్ శాఖలో డీఈగా పనిచేసిన రమేశ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. లీకేజి కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కి సురేశ్ మిత్రుడు కాగా.. రమేశ్‌కి సురేశ్ బంధువు. ఆ మొత్తం వ్యవహారంలో ప్రవీణ్‌కుమార్, డీఈ రమేశ్ మధ్య ఎలాంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు.
అతనికి 70.. ఇతనికి 30 : ఇద్దరూ సైదాబాద్‌లో నివాసం ఉంటుడంగా అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా పత్రాలు ప్రవీణ్ నుంచి సురేశ్‌కి అందాయి. ఆ విషయాన్ని రమేశ్‌కి సురేశ్ తెలిపాడు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో అభ్యర్ధులకు వివిధ అంశాలపై రమేశ్ శిక్షణనిస్తుంటాడు. ఆ సమయంలో అక్కడి అభ్యర్ధులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ప్రశ్నాపత్రాలు విక్రయిస్తే వచ్చిన వాటిలో రమేశ్‌కి 40శాతం ఇస్తానని సురేశ్ చెప్పగా.. అందుకు ఒప్పుకోలేదు. చివరకు రమేశ్‌కి 70 శాతం, సురేశ్‌కి 30 శాతంగా ఒప్పందం కుదిరింది. అలా తనకున్న పరిచయాలతో 30 మందికి పేపర్లు విక్రయించి రమేశ్ కోటి 10 లక్షలు సంపాదించినట్లు సిట్ గుర్తించింది.
మాల్‌ప్రాక్టిస్ దందాచేసిన రమేశ్ : టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం బయటకు రాకముందు రమేశ్ మాల్‌ప్రాక్టిస్ దందాచేసినట్లు సిట్ గుర్తించింది. ఫిబ్రవరి 26 న జరిగిన డీఏఓ, జనవరిలో జరిగిన ఏఈఓ పరీక్షల్లో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు వాడి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రాసే నలుగురు, డీఏఓ పరీక్ష రాసే అభ్యర్ధులతో ఒప్పందం చేసుకొని ఒక్కొక్కరి నుంచి 40 నుంచి 50లక్షల వరకు వసూలు చేశాడు. ఆ తర్వాత అభ్యర్ధుల పరీక్ష కేంద్రాలకి వెళ్లి యాజమాన్యం లేదా ప్రిన్సిపాల్‌లతో మాట్లాడి ఒప్పందం చేసుకున్న వారి వివరాలిచ్చి సీటింగ్ వివరాలు తెలుసుకున్నాడు. తద్వారా పరీక్ష జరిగేప్పుడు వారికి ఏ పేపర్ సెట్‌వస్తుందో అంచనా వేశాడు. అనంతరం ఒప్పందం చేసుకున్న అభ్యర్ధులను హైటెక్ పద్దతిలో పరీక్షరాసేందుకు ఏర్పాట్లుచేసినట్లు సిట్ తెలిపింది.
- TSPSC పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్.. రూ.6 లక్షలకు DAO ప్రశ్నాపత్రం విక్రయం
- TSPSC పేపర్ లీకేజీ.. కారు అమ్మేసి.. ఆ ప్రశ్నపత్రం కొన్న దంపతులు
అభ్యర్థులకు శిక్షణ : ఒక సిమ్ కార్డుతో పనిచేసే చిన్న పరికరాలు కొనుగోలు చేసి వాటిని అమర్చుకునే విధానంపై అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాడు. ఓప్రాంతంలో వారికి ట్రయల్ నిర్వహించినట్లు సిట్ గుర్తించింది. సిమ్ కార్డుతో ఉన్న ఆ పరికరాలను అభ్యర్ధులు లోదుస్తుల్లో సూక్ష్మంగా ఉండే రిసీవర్‌ను చెవిలో పెట్టుకున్నారు. పరీక్ష ప్రారంభమైన కొన్నిక్షణాల్లో ఒప్పందం కుదర్చుకున్న అభ్యర్దికి వచ్చిన పేపర్ సెట్ అదే సెట్ వచ్చి గైర్హాజరైన అభ్యర్ది పేపర్‌ను సేకరించాడని తెలిపారు.
అభ్యర్ధులకు ఫోన్ చేసి సమాధానాలు : పరీక్షరాస్తున్న అభ్యర్ధులకు ఫోన్ చేసేవాడని.. అందుకు కొందరిని నియమించుకున్నట్లు సమాచారం. ఆ విధంగా నలుగురు ఏఈఈ, ముగ్గురు డీఏఓ అభ్యర్ధులను పరీక్ష రాయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. డీఈ రమేష్ చిట్టాలో ఇంకా చాలామంది ఉంటారని సిట్ భావిస్తోంది. ఎంతమందితో పరీక్షరాయించాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే లీకేజీతో సంబంధం ఉన్న మరికొందరి వివరాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: