నిరుద్యోగ భృతి పేరుతో యువతను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. లక్షా 91 వేల ఉద్యోగులు భర్తీ చేస్తూనే.. నిరుద్యోగులకు రెండేళ్లుగా ఇవ్వాల్సిన భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఓడిస్తేనే..
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినందునే ప్రభుత్వం.. 50 వేల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి ప్రకటించిందని ఉత్తమ్ విమర్శించారు. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తామన్న సీఎం కేసీఆర్.. నెల రోజులు దాటినా ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. పట్టభద్రుల, సాగర్ ఉప ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే రూ. 3016 భృతి తప్పనిసరిగా వస్తుందని వెల్లడించారు. ముందు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించిన తర్వాతనే ప్రజలను కేసీఆర్ ఓట్లు అడగాలని హితవు పలికారు.
రాష్ట్రానికి భాజపా అన్యాయం చేస్తోంది
రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులు.. చిన్నారెడ్డి, రాములు నాయక్‌కు గాంధీ భవన్లో ఉత్తమ్ బీ ఫారాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన హామీలను భాజపా ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలను తీసుకు రావడంలో బండి సంజయ్ విఫలం చెందారని విమర్శించారు. అయోధ్య రామమందిరానికి తాము వ్యతిరేకం కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపా, తెరాసను చిత్తుగా ఓడించాలని సూచించారు.
ఇదీ చదవండి: దుబ్బాక రైతు వేదిక ప్రారంభోత్సవంలో రసాభాస