పదహారో రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ప్రభుత్వం మేలుకోవాలన్న ప్లక్కార్డులు పట్టుకుని నిరసన తెలుపుతామని ఐకాస ప్రకటించింది. ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపిన ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సోమవారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే.. ఆర్టీసీ నష్టాల్లోకి ఎందుకు వెళ్తుందని ప్రశ్నించారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని... మరోసారి ఐకాస స్పష్టం చేసింది.
ఆర్టీసీ సమ్మె విషయంలో చర్చలకు పిలవని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మల దగ్ధానికి వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న ప్రజలను అరెస్టులు, అక్రమ కేసులు, నిర్భంధానికి పాల్పడటాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ వస్తున్న కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆర్టీసీ కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీని కాపాడాలని కోరారు.
మరోవైపు సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ జిల్లాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ రవాణ, డిపో మేనేజర్లతో సమీక్షించి జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో 263 బస్సులు తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్