కార్మికులు దాచుకున్న సీసీఎస్ డబ్బులను ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న ఛలో బస్‌భవన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జె.హనుమంతు ముదిరాజ్ తెలిపారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. కార్మికులు సీసీఎస్‌లో దాచుకున్న 920 కోట్ల రూపాయలను ఆర్టీసీ యాజమాన్యం నేటికీ ఇవ్వకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్ డబ్బులను గత రెండేళ్లుగా వాడుకుంటూ కార్మికులు కష్టకాలంలో ఆ డబ్బును వినియోగించుకోకుండా ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
సమ్మె సమయంలో అసువులు బాసిన కార్మికులను ఆదుకోవడానికి నాటి టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డికి ఎన్నారై దాతలు ఇచ్చిన విరాళాలను నేటికీ బాధితులకు అందచేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. టీఎంయూ నేతలు కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి తమ సొంత ప్రయోజనాల కోసం బయటకు రావడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడని నాయకుల పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు