హైదరాబాద్ జియా గూడ పరిధి సబ్జీ మండిలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికీ రసాయనాల పిచికారీ చేశారు. న్యూ గంగా, నవోదయ, గంగా, కార్గిల్ తదితర బస్తీల్లో ద్రావణం చల్లించారు. హైదరాబాద్ మహా నగరంలో రోజు రోజుకూ కరోనా విజృంభిస్తోందని... స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ బస్తీల్లో కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారని... బల్దియాకు సమాచారం అందించి తమ పరిసరాలను శుభ్రం చేయాలని కోరామని సంఘం అధ్యక్షుడు గూడమని అశోక్ బెస్త అన్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని కాలనీ వాసులు వాపోయారు. అందుకే తమ సంఘం ఆధ్వర్యంలో రసాయనాల పిచికారీ చర్యలు చేపట్టామని అశోక్ స్పష్టం చేశారు.
లాక్డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన కూలీలకు, బస్తీ వాసులకు , సంఘీయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని సంఘం కోశాధికారి గంట నరేష్ బెస్త తెలిపారు. సుమారు 1000 కుటుంబాలకు, ఒక్కో వ్యక్తికి 25 కిలోల రైస్ బ్యాగ్, కంది పప్పు అందించామని నరేశ్ వివరించారు. మరోవైపు గంగపుత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కరోనా పట్ల చైతన్యం చేశామని సంఘం నేతలు రుక్మిణీ బెస్త, రాజ్యలక్ష్మి బెస్త పేర్కొన్నారు. అంతకంతకూ కొవిడ్ ఉద్ధృతం అవుతున్నందున బస్తీ వాసులందరూ తప్పనిసరిగా చేతులు,కాళ్లు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ న్యాయవాది రుక్మిణీ బెస్త కోరారు. శానిటైజేషన్‌ను నిర్లక్ష్యం చేయకుండా వినియోగించాలని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి బెస్త సూచించారు.
ఇదీ చూడండి : హృదయ విదారకం: ఆయన 'ప్రయాణం'.. అర్థాంతరంగా ఆగి'పోయింది'!