ఈసారి పాఠశాలలకు ఆరు రోజులకు బదులు అయిదు రోజులే సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీకి బదులు 12 నుంచి 16 వరకు మాత్రమే సెలవులిస్తారు. విద్యా కాలపట్టిక (అకడమిక్ క్యాలెండర్ ) ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవలుండాలి.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నాడు దసరా సెలవులు పొడిగించినందున ఏడు రెండో శనివారాలు పాఠశాలలు పనిచేయాలని అప్పట్లో విద్యాశాఖ జీఓ జారీ చేసింది. ఇప్పుడు రెండో శనివారం సెలవు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లఘించినట్లవుతుందని భావించిన కమిషనర్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఏయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు 11న పనిచేయాలని తాజా ఆదేశాలు జారీ చేశారు.
సెలవులను కుదించడం సరికాదని అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులివ్వాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సంక్రాంతి సెలవులు 11 నుంచి అని ఉపాధ్యాయులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నారని... ఇప్పుడు 12 నుంచి సెలవులంటే విద్యార్థులూ ఇబ్బంది పడతారాని సంఘాలు పేర్కొన్నాయి.
జూనియర్ కళాశాలలకు 15 వరకే...
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఈనెల 12 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులుంటాయి. జూనియర్ కళాశాలలు మాత్రం 11న పనిచేస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు.
ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా హింస, అహింస మధ్య సాగిన 'భారత్ బంద్'