తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Rtc Md Vc Sajjanar) ఓ సాధారణ ప్రయాణికుడిగా మారి బస్సులో ప్రయాణించారు. ఉదయం 11 గంటలకు లక్డీకాపూల్ బస్టాపులో బస్సు ఎక్కి కండక్టర్‌కు తానెవరో చెప్పకుండా టికెట్ తీసుకుని ఎంజీబీఎస్ వరకు ప్రయాణిస్తూ వారి సాధకబాధలను సజ్జనార్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎంజీబీఎస్‌లో కూడా సాధారణ వ్యక్తిగా వెళ్లి పరిసరాలను పరిశీలించారు.
బస్టాండ్ ప్రాంగణంలోని పరిశుభ్రత, ఏఏ ఫ్లాట్ ఫాంలలో ఏఏ రూట్‌లలో బస్సులు వెళ్తాయో తెలిపే సెక్టార్ వైజ్ రూట్ బోర్డు, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పనితీరును ఎండీ పరిశీలించారు. అలాగే మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. ప్లాట్ ఫాంపై ఉన్న బస్సు సిబ్బందితో మాట్లాడి ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సులోని ప్రయాణికులతో కూడా రవాణా సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడకు చేరుకున్న ఈడీ (హెచ్ అండ్ కే) సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.
పరిసరాలను శుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపర్చాలని, పార్కింగ్ స్థలంలో చాలా కాలంగా పేరుకుపోయున వాహనాలను తక్షణమే స్క్రాప్ యార్డ్‌కు తరలించాలని ఆదేశించారు. ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి పార్కు నిర్వహణ బాధ్యతను ఔట్ సోర్సింగ్ ఏజెంట్‌కు అప్పగించాల్సిందిగా సూచించారు. ఖాళీగా ఉన్న స్టాళ్లను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు.
టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా పండుగలు, వివాహ సమయాలలో బస్సులను అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని సూచించారు. రాబోయే దసరా పండుగ రద్దీకి తగిన బస్సులను నడిపి సంస్థ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పటి నుంచే రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని తగిన ప్రచారం కూడా చేయాలని ఎండీ ఆదేశించారు.
ఇవీ చూడండి: చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలిచివేసింది: పవన్‌కల్యాణ్