శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారిపై పలు చోట్ల వరద నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు కలిసి నీటిని మోటార్లతో ఎత్తి పోశారు. కానీ కొన్ని చోట్ల వరద నీరు అలాగే ఉండిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ఆయా రహదారుల మీదుగా రాకపోకలను నియంత్రించారు. రహదారులను బారికేడ్లతో మూసేశారు. మలక్పేట రైల్వే వంతెన వద్ద రహదారి, గడ్డి అన్నారం నుంచి శివగంగ టాకీస్ వెళ్లే రహదారి మూసారాంబాగ్ వంతెన, చాదర్ ఘాట్ వద్ద ఉన్న కింది వంతెనపై నుంచి రాకపోకలు నియంత్రించారు.
పురానాపూల్ 100 ఫీట్ల రోడ్, టోలిచౌకి వంతెన కింది నుంచి వెళ్లే రహదారి.. మొగుల్ కాలేజ్ నుంచి బండ్లగూడ మీదుగా ఆరాంఘర్ వెళ్లే దారి, ఫలక్నుమా రైల్వే బ్రిడ్జి రోడ్, మహబూబ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి ఐఎస్ సదన్ వెళ్లే రహదారిని అధికారులు మూసేశారు. వరద నీరు తొలగించిన తర్వాత వాహనాలను అనుమతించే అవకాశం ఉంది. అంతవరకు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: కళ్లముందే మూసీలో కొట్టుకుపోయిన వ్యక్తి