రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అతి త్వరలోనే లబ్ధిదారులకు కార్డులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కార్డుల జారీ ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
కార్డులతో పాటు రేషన్ కలిపి..
రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన, పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే ఎన్ఐసీ వెరిఫికేషన్ పూర్తై జిల్లాల వారీగా ధ్రువీకరణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4,15,901 దరఖాస్తుల విచారణ తుది దశకు చేరుకుందని... అత్యంత త్వరలోనే లబ్ధిదారులను గుర్తించి వీలైనంత త్వరగా కార్డులతో పాటు రేషన్‌ను ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
నిర్విరామంగా విధుల్లో నిమగ్నమై
గత 15 రోజులుగా జిల్లా స్థాయిలో రెవెన్యూ శాఖతో పాటు ఇతర సిబ్బంది, రాజధానిలో జీహెచ్ఎంసీ సహా ఇతర సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి అర్హుడిని గుర్తించడం కోసం జిల్లా కలెక్టర్లు, డీఎస్ఓలు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నూతన కార్డుల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడినా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి పేదవాని ఆకలి తీర్చడానికే సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం 4,46,168 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 4,15,901 దరఖాస్తుల విచారణ తుదిదశకు చేరుకుందని మంత్రి గంగుల వెల్లడించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 87.43 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటి వల్ల సుమారు 2.83 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ అందుతోంది. కొత్తకార్డులివ్వాలన్న నిర్ణయంతో రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుల సంఖ్య సుమారు 92 లక్షలకు పెరుగుతుంది.
ఇదీ చూడండి: Land Value: పట్టణాల్లో సగం, గ్రామాల్లో నాలుగురెట్లు ఆస్తుల విలువ హెచ్చు!