కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని మహంకాళి దేవి ఆలయం వద్ద సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని ఎమ్మెల్యే పిచికారీ చేశారు. సొంత నిధులతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్లు.. త్వరలో మరో రెండు ట్రాక్టర్లు కూడా తీసుకొచ్చి డివిజన్లోని ప్రతి ఇంటి సమీపంలో స్ప్రే చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావుతో పాటు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్‌తో పాటు పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటి వద్ద కరోనా మహమ్మారి దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు స్థానికులు సమస్యలను విన్నవించారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్లోని ప్రజలకు అంజయ్య నగర్ వద్ద ప్రత్యేకంగా కరోనా పరీక్షా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చూడండి: 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మించాం: కేటీఆర్