గత నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ సుభాషణ్ రెడ్డి .... గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం అవంతినగర్లోని స్వగృహానికి తరలించారు.
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ప్రస్థానం...
1943లో హైదరాబాద్‌లోని బాగ్‌అంబర్‌పేటలో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి జన్మించారు. సుభాషణ్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించారు. 1991లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2001లో మద్రాస్, 2004లో కేరళ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల సంఘం తొలి ఛైర్మన్‌గా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా సేవలందించారు.
ప్రముఖుల సంతాపం...
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుభాషణ్‌రెడ్డి మృతి న్యాయరంగానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. న్యాయమూర్తిగానే కాకుండా ఆయన గొప్ప మానవతావాదీ అని స్మరించుకున్నారు.
సుభాషణ్ రెడ్డి పార్థివదేహానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, బంధువులు నివాళులు అర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు...
ప్రభుత్వ లాంఛనాలతో జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజల సందర్శన అనంతరం.. పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించారు. న్యాయకోవిదుడిని కడసారిగా చూసేందుకు ఆయన అభిమానులు భారీగా మహాప్రస్థానానికి తరలివచ్చారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాల మధ్య ఆయన కుమారుడు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీ చూడండి:రాంపూర్ పంప్‌హౌస్ వద్ద అగ్నిప్రమాదం