ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్ర చికిత్సలు చేయవచ్చంటూ కేంద్రం ఇచ్చిన కొత్త జీవోలను వ్యతిరేకిస్తూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ పిలుపు మేరకు జూనియర్ వైద్యులు హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. కోఠి మెడికల్ కళాశాల నుంచి డీఎంఈ వరకు నిర్వహించిన ర్యాలీలో వైద్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం ఆరు నెలల కోర్సు చేసి శస్త్ర చికిత్సలు ఎలా చేస్తారని జూనియర్ వైద్యులు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు ఎనిమిదేళ్లు చదివిన తర్వాత ఒక ఎంబీబీఎస్ వైద్యుడికి శస్త్రచికిత్సలు చేయటానికి అర్హత లభిస్తే.. కేవలం ఆరు నెలల కోర్సు చేసి శస్త్ర చికిత్సలు ఎలా చేస్తారని వైద్యులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని... అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆయుర్వేద వైద్యులు శాస్త్ర చికిత్సలు చేస్తే ఏ విధంగా ఉంటుందో జూనియర్ వైద్యులు దిష్టిబొమ్మకు చికిత్స చేసి నిరసన తెలిపారు.
ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు