Groceries Rates: పెరిగిన ధరలు.. పచ్చడి మెతుకులు భారమే! - Mango rates
Groceries Rates: రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. ఏది కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. పచ్చళ్లు పెట్టుకోవాలన్నా సరుకుల ధరలన్నీ చుక్కలు చూపిస్తున్నాయి.
Groceries Rates: పప్పన్నమే కాదు, పచ్చడి మెతుకులు తినాలన్నా.. పేదలకు భారంగా మారింది. వేసవి సీజన్‌లో పచ్చళ్ల తయారీ మొదలైనా నిత్యావసరాల ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. తయారీకి అవసరమైన సరకుల ధరలన్నీ మండిపోతున్నాయి. మామిడికాయల టోకు ధర ఈనెల 12న హైదరాబాద్ బాటసింగారం పండ్ల మార్కెట్‌లో ఏకంగా రూ.లక్షా 24వేలు పలికింది. ఇది దేశంలోనే కొత్త రికార్డని మార్కెటింగ్ శాఖ తెలిపింది. చిల్లరగా నాణ్యమైన పెద్దసైజు పచ్చడి మామిడికాయలు కిలో ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.80 నుంచి 100 దాకా పలుకుతోంది. గతేడాది ధరకిది రెట్టింపు. నిమ్మకాయలదీ అదే దారి. నాణ్యమైన పెద్దసైజు నిమ్మకాయ ఒక్కోటీ రూ.10కి అమ్ముతున్నారు. నిమ్మ, మామిడి దిగుబడి గణనీయంగా తగ్గడంతో ధరలూ చెట్టెక్కి కూర్చున్నాయి.
వంటనూనెలు సలసల...
పచ్చళ్ల తయారీకి అవసరమైన వేరుసెనగ నూనె లీటరు చిల్లర ధర రూ.170 నుంచి 180 వరకూ పలుకుతోంది. నువ్వులనూనె ధర గతేడాదితో పోలిస్తే రూ.180 నుంచి 200కి చేరింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలైనప్పుడు పెరిగిన వంటనూనెల ధరలింకా పెద్దగా తగ్గలేదు. మామిడికాయలతో ఆవకాయ, ఊరగాయ పచ్చళ్ల తయారీకి వేరుసెనగ లేదా నువ్వులనూనెతో పాటు ఆవపిండి, మెంతులపొడి, కారం, ఉప్పు వంటి సరకులనూ ప్రాంతాలను బట్టి ప్రజలు వినియోగిస్తారు. వీటిలో కారంపొడి ధర కిలో రూ.200 దాటింది. మిరపకాయల ధరలు మండుతున్నందున పచ్చళ్ల తయారీకి నాణ్యమైన కారం కావాలంటే కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.300 దాకా చెబుతున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల వరంగల్ మార్కెట్‌లో దేశీ సింగిల్‌పట్టీ మిర్చి ధర క్వింటాకు రూ.50వేలు దాటింది. నిల్వ పచ్చళ్లకు కొన్ని ప్రముఖ బ్రాండ్ల కారంపొడినే గృహిణులు వినియోగిస్తారు. వాటి ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కోతీరుగా ఉంటోంది. ఆవాలు ఉత్తరాది నుంచి వస్తున్నాయి. రవాణా ఛార్జీల పెంపుతో వాటి ధరలూ భారంగా మారాయి.
దుకాణాల్లో కొన్నా...
పట్టణాలు, నగరాల్లో ఎక్కువమంది గృహిణులు నిల్వ ఆవకాయ, ఊరగాయ, నిమ్మ, ఉసిరికాయ పచ్చళ్లను తయారుచేసుకోలేక దుకాణాల్లో కొనడం సాధారణమైంది. దూసుకెళ్తున్న సరకుల ధరలతో కొత్త పచ్చళ్ల తయారీ భారం పెరిగిందని హైదరాబాద్‌లోని ఓ దుకాణ యజమాని చెప్పారు. అందువల్ల పచ్చళ్లపై కిలోకు అదనంగా రూ.100 వరకూ పెంచకతప్పడం లేదన్నారు. ధరల పెరుగుదల కారణంగా గతంలో కిలో, రెండు కిలోలు కొనేవారు ఇప్పుడు అరకిలో, కిలో చొప్పునే కొంటున్నారని చెప్పారు. అమెరికా, ఐరోపా దేశాలతో పాటు ఆస్ట్రేలియాలో ఉంటున్నవారికి ఇక్కడి నుంచి పచ్చళ్లను కొని కొరియర్ ద్వారా పంపుతున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల్లో తెలుగువారు తప్పనిసరిగా నిల్వ పచ్చళ్లు తీసుకెళ్లడం ఆనవాయితీ. వాటికి డిమాండు తగ్గలేదని, ఇక్కడ సామాన్యులు మాత్రం చిల్లర ధరలు భరించలేకపోతున్నారని అమీర్‌పేటలో పచ్చళ్లను అమ్మే ఓ వ్యాపారి వివరించారు.
* ప్రపంచవ్యాప్తంగా పచ్చళ్ల మార్కెట్ వ్యాపార విలువ 12,651 మిలియన్ అమెరికా డాలర్లని అంచనా. ఇది 2026 నాటికి 14,100 మిలియన్ డాలర్లకు చేరనుంది. ఏటా 4 శాతం వృద్ధిరేటు నమోదవుతోంది.
* భారత్‌లో ఏటా ఒక కుటుంబ పరంగా పచ్చళ్ల వినియోగం సగటున 2 కిలోలుందని ‘భారత పచ్చళ్ల తయారీ పరిశ్రమల సంఘం’ తెలిపింది. కానీ దక్షిణాదిన కొన్ని కుటుంబాల్లో ఈ సగటు కన్నా 2 నుంచి 5 రెట్ల ఎక్కువ వినియోగం ఉంది. ఈ లెక్కన ఏటా 50కోట్ల కిలోలకు పైగా పచ్చళ్లను దేశంలో విక్రయిస్తున్నారు.
ఒక కుటుంబంపై భారం..
* తెలుగు రాష్ట్రాల్లో నలుగురు సభ్యులుండే ఒక కుటుంబం ఏడాది వినియోగానికి ప్రాంతాలను బట్టి సగటున కనీసం 5 నుంచి 10 కిలోల వరకూ పచ్చళ్లను తయారుచేసి నిల్వ పెట్టుకోవడం ఆనవాయితీ.
* పచ్చళ్లలో వివిధ రకాల సరకుల ధరలను బట్టి చూస్తే 5 కిలోల పచ్చడి తయారీకి అదనంగా ఖర్చు రూ.300 దాకా పెరిగిందని హైదరాబాద్‌కు చెందిన పచ్చళ్ల తయారీ దుకాణ యజమాని ఒకరు చెప్పారు. రష్యా యుద్ధం, కరోనా విపత్తు కారణంగా పలు రకాల సరకుల ధరలు అనూహ్యంగా పెరిగాయని ఆయన వివరించారు.
ఇవీ చూడండి..
తీగల వంతెనపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య... కారణం అదేనా.?
ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన ప్రేయసి బంధువులు.. కిడ్నాప్ చేశాడని.