How to Cure Dry Feet Skin: చలికాలంలో చాలా మందికి అనేక చర్మ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కొంతమందికి కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మం పొడిబారి పొలుసుల్లా మారిపోతుంటుంది. అయితే, ఇది కేవలం చలికాలంలోనే కాకుండా సీజన్‌తో సంబంధం లేకుండానే ఎదురవుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో పొడిబారిన, పెళుసుబారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరినూనె: కొద్దిగా కొబ్బరినూనెను తీసుకొని చర్మపు పొరల్లోకి ఇంకే వరకు పాదాలపై మృదువుగా మసాజ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా రాత్రంతా పాదాలను ఇలానే వదిలేసి నిద్రపోవాలని ఫలితంగా కొద్ది రోజుల్లోనే పాదాలపై చర్మం తిరిగి కోమలంగా మారుతుందని అంటున్నారు. ఇంకా పొడిబారిన, పెళుసుబారిన చర్మానికి కొబ్బరినూనె తగినంత తేమని అందించి తిరిగి మృదువుగా మారుస్తుందని వివరిస్తున్నారు. 2018లో Journal of Cosmetic Scienceలో ప్రచురితమైన "Moisturizing and Anti-Inflammatory Effects of Coconut Oil on Dry Skin" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తేనె: సమస్యకు తేనెతో కూడా పరిష్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొడిగా మారిన పాదాలకు తేనెను అప్లై చేసి రెండు లేదా మూడు నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలని వివరిస్తున్నారు. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి నీళ్లతో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమను అందించడంతో పాటు మృదువుగానూ మార్చుతుందని తెలిపారు.
కలబంద: చర్మ సంరక్షణకు చాలా మంది కలబందను వినియోగిస్తుంటారు. కొద్దిగా కలబంద గుజ్జు తీసుకొని పాదాలకు అప్లై చేసి.. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా రోజుకి రెండుసార్ల చొప్పున క్రమం తప్పకుండా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పాదాలు కోమలంగా మారతాయని చెబుతున్నారు.
స్క్రబ్: ఇంకా ఇవే కాకుండా స్క్రబ్‌తో కూడా సమస్య తీరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం అరచెంచా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్ రెండు చెంచాల చొప్పున ఒక పాత్రలో తీసుకొని బాగా కలపాలని చెబుతున్నారు. అనంతరం ఈ మిశ్రమాన్ని కాళ్లు, పాదాల వద్ద పొడిగా మారిన చర్మంపై అప్లై చేసి కాసేపు మృదువుగా మసాజ్ చేయాలని తెలిపారు. అనంతరం 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుని.. పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా తరచూగా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందని పేర్కొన్నారు.
- ముఖ్యంగా కాళ్లు, పాదాలపై గాయాలతో బాధపడే వారు అవి పూర్తిగా తగ్గిన తర్వాతే ఈ చిట్కాలను పాటించాలని నిపుణులు అంటున్నారు.
- ముఖ్యంగా మరీ వేడిగా ఉన్న నీటితో కాళ్లు, పాదాలు శుభ్రం చేసుకోకూడదని చెబుతున్నారు.
- రోజూ స్నానం చేసిన అనంతరం పాదాలకు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవాలని వివరిస్తున్నారు.
- ఇంకా మరీ బిగుతుగా ఉండే సాక్సులు, షూస్, చెప్పులు వంటివి ధరించకూడదని చెబుతున్నారు.
- ఎక్స్‌ఫోలియేషన్‌కి ఉపయోగించే పరికరాలను ఎప్పటికప్పుడు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలికాలంలో ఎన్ని క్రీములు రాసినా ఫలితం లేదా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి!