Hyderabad National Book Fair: ఏటా సాహితీ ప్రియులను అలరించే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఈనెల 18 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్... ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే 34వ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
గతేడాది కొవిడ్ కారణంగా బుక్ ఫెయిర్ నిర్వహించలేకపోయామని... ప్రస్తుతం ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నా.. కరోనా నిబంధనలతో పుస్తక ప్రదర్శనను విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్ ఇలా అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలు బుక్ ఫెయిర్‌లో లభ్యమవుతాయని.. ఇందులో 250 స్టాళ్లు కొలువుదీరుతున్నాయని తెలిపారు. పుస్తకాల క్రయవిక్రయాలతో పాటు.. సాహితీ సమ్మేళనాలు, వక్తృత్వ పోటీలు, పుస్తకావిష్కరణలు పదిరోజుల బుక్ ఫెయిర్‌లో ఆకట్టుకుంటాయని గౌరీశంకర్ అన్నారు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 వరకు... శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్ ఉంటుందని ఆయన తెలిపారు.
ఈనెల 18 నుంచి 28 వరకు 34వ జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించాలని మేం నిర్ణయం తీసుకున్నాం. పుస్తక ప్రదర్శనకు సంబంధించి 10 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతుంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ బుక్‌ఫెయిర్‌కు చాలా మంది హాజరవుతారు. ముఖ్యంగా ఈసారి 250 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాం. కరోనా వైరస్ వల్ల గత ఏడాది పుస్తక ప్రదర్శనను నిర్వహించలేకపోయాం. వేదికకు చిందు ఎల్లమ్మ, మిమిక్రి ఆర్టిస్ట్ నేరళ్ల వేణుమాధవ్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.
--జూలూరీ గౌరీశంకర్, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు
ఇదీ చూడండి: పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన