Hussain Sagar: హైదరాబాద్‌లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎడతెరపి లేని వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం జలకళను సంతరించుకుంది. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41మీటర్లకాగా.. ప్రస్తుతం 513.41మీటర్ల నీరుచేరింది. దీంతో అధికారులు వరదనీటిని తూముల ద్వారా బయటకు పంపిస్తున్నారు.
జంట జలాశయాలకు వరద పోటు: నగరానికి తాగునీరు అందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు ఎగువ నుంచి వరద వస్తోంది. ఉస్మాన్‌సాగర్ జలాశయానికి 400క్యూసెక్కుల పైగా వరదనీరు చేరడంతో రెండు గేట్లు ఎత్తి 408క్యూసెక్కుల నీటిని మూసిలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790అడుగులు కాగా. ప్రస్తుతం 1786 అడుగుల నీరు చేరింది. మరోవైపు హిమాయత్‌సాగర్ జలాశయానికి వరదనీరు తగ్గుతోంది. హిమాయత్‌సాగర్‌లోకి 200క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా రెండు గేట్ల ఎత్తి 170క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1760.50అడుగులకు చేరింది.