Harish Rao In Assembly: వచ్చేనెలలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కేసీఆర్ కిట్ పథకం అద్భుతమైన ఫలితాలు ఇస్తోందని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 56 శాతం ప్రసవాలు అవుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు
2014 తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాలు 26 శాతం పెరిగాయని అసెంబ్లీలో ప్రకటించారు. 2017 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు రూ.1387 కోట్ల విలువైన 10.85 లక్షల కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.407 కోట్లతో 22 మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా.. అందులో ఇప్పటికే 16 పూర్తయినట్లు పేర్కొన్నారు. 2014లో ప్రసూతి మరణాల రేటు 92శాతం ఉండగా ఇప్పుడది 63 శాతానికి తగ్గిందని హరీశ్ రావు స్పష్టం చేశారు. అలాగే శిశు మరణాల రేటు సైతం 39 నుంచి 23 శాతానికి తగ్గినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నట్లు తెలిపిన మంత్రి పోషకాహార లోపం సమస్యను అధిగమించేందుకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని బడ్జెట్లో పెట్టామన్నారు.
ఆ 9 జిల్లాలు ఇవే
కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలో పోషకాహారం లోపం ఉన్నందున కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయనున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.
ముఖ్యంగా గర్భిణీలకు మొదటి 12 వారాల్లో రూ.3 వేలు ఇవ్వడం జరుగుతుంది. డెలివరీ సమయంలో ఆడపిల్ల పుడితే రూ.4వేలు, మగపిల్లవాడు పుడితే 3 వేలు ఇస్తున్నాం. మూడునెలల్లో మొదటి వ్యాక్సినేషన్ వేసినప్పుడు రూ.3 వేలు ఇచ్చాం. 9 నెలల సమయంలో రెండో వ్యాక్సినేషన్ వేసినప్పుడు మిగిలిన రూ.3 వేలు ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకునేలా డబ్బులు ఇస్తున్నాం. కంపల్సరీ మనం వ్యాక్సినేషన్లో పురోగతి సాధించాలనే మా ఆశయం. దేశంలోనే మనం మెరుగైన స్థితిలో ఉన్నాం.- హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి