కరోనా తీవ్రతతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి చికిత్స అందించేందుకు అవసరమైన ప్లాస్మా సమకూర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలంగాణ ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వెల్లడించారు. తనకు కొవిడ్ సోకినపుడు చనిపోతానని భయపడ్డానని, వైద్యులు ధైర్యం చెప్పడం వల్లే ప్రాణాపాయం లేదన్న భరోసా కలిగిందని తెలిపారు. కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డ తాను.. కరోనా రోగులకు ఉపయోగపడే పని చేయాలని ఆలోచించి ప్లాస్మా దాతల సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించి ఈ సేవలు చేయడం లేదని, కేవలం ఆత్మ సంతృప్తి కోసమే చేస్తున్నట్లు గూడూరు పేర్కొన్నారు. కొవిడ్ నుంచి కోలుకుని ప్లాస్మాదానం చేసిన ఈయన.. ఇప్పటి వరకు 116 మంది కరోనా రోగులకు దాతల నుంచి ప్లాస్మా సమకూర్చగలిగినట్లు వెల్లడించారు. తెలంగాణ నుంచే కాక.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం రోగికి సరిపడా రక్త గ్రూపులు ఉండి.. ఇతర అర్హతలు కలిగి ఉన్నట్లయితే ప్లాస్మా దాతగా పేరు నమోదు చేసుకుని అవసరమైన వారికి అనుసంధానం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్లాస్మా దాతల వివరాలు సేకరించి అనుసంధానం చేయడంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సైతం సంతృప్తి వ్యక్తం చేశారని చెబుతోన్న తెలంగాణ ప్లాస్మా దాతల అసోసియేషన్ అధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చదవండి: కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం