వీడని వర్షాలతో రాజధాని అతలాకుతలమవుతోంది. శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు, బస్తీల్లోకి వరదనీరు చేరింది. వందలాది కాలనీల ప్రజలు చీకట్లో కంటిమీద కునుకులేకుండా గడిపారు. కొద్దిగా తేరుకుంటున్న ఇళ్లు మళ్లీ ముంపుబారిన పడడం వల్ల వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. బస్తీల్లోని రహదారులపై బోట్లు తిరుగుతున్నాయి. మరో మూడ్రోజులు భారీవర్షాలు కురుస్తాయనే హెచ్చరికతో ప్రజలు వణుకుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వీధుల్లో ప్రవహిస్తుండటం వల్ల పలువురు బాధితులు ఇళ్లలో చిక్కుకుపోయారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. నగరంలో వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో అయిదుగురు మృతి చెందారు. హిమాయత్‌సాగర్ 4 గేట్లు తెరవటంతో మూసీలోకి వరదనీరు చేరుతోంది. పరివాహక ప్రాంతాలపై పెను ప్రభావం పడింది. పలు ప్రాంతాల్లో చెరువులు నిండిపోవడంతో ముంపు ముప్పు మరింతగా ఉరుముతోంది.
చెరువుల్లో నీళ్లు ఇళ్లలోకి
- జీహెచ్‌ఎంసీ పరిధిలో 185, హెచ్‌ఎండీఏ పరిధిలో 3,132 చెరువులున్నాయి. చాలా చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది.
- గుర్రం చెరువుకు గండిపడటం వల్ల గగన్‌పహాడ్ నుంచి చాంద్రాయణగుట్ట వరకూ ఇళ్లలోకి వరద చేరింది. వాహనాలు కొట్టుకుపోయాయి.
- దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, శారదానగర్, బీబీనగర్, కోదండరాంనగర్ తదితర ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది.
- బాలాపూర్ వద్ద గుర్రంచెరువు, మైలార్‌దేవ్‌పల్లి పల్లెచెరువు, మీర్‌పేట చెరువు, జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ పరిసర కాలనీలు, బస్తీలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
- బాలాపూర్ గుర్రం చెరువు నీరు మీర్‌పేటలోని మూడు చెరువుల్లోకి చేరి, సమీప నివాసాల్లో 2-3 అడుగుల ఎత్తున చేరింది.
- జల్‌పల్లిలోని బుర్హాన్ చెరువు, సరూర్‌నగర్ చెరువు, పల్లె చెరువు పరిసర కాలనీలు, బస్తీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కొన్నింటికి అధికారుల గండి
పల్లెచెరువు, గుర్రం చెరువులకు మరిన్ని గండ్లు పడే అవకాశం ఉందనే హెచ్చరికలతో దిగువ కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా మారిన చెరువులకు అధికారులే గండికొట్టిస్తున్నారు. ఆర్టీసీకాలనీ, రామకృష్ణానగర్, ఆదర్శనగర్ కాలనీల ప్రజలను అప్రమత్తం చేసి, ఫీర్జాదిగూడ చెరువుకు; అలాగే చెంగిచెర్ల చింతల చెరువుకు గండికొట్టారు. పోచమ్మకుంట తెగిపోవటంతో ఆ నీరు మూసీలోకి చేరుతోంది.
దెబ్బతిన్న రహదారులు
నాలాలు, చెరువులు ఉప్పొంగడం వల్ల పలు ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోయాయి. ఎల్‌బీనగర్, జల్‌పల్లి, ఉప్పల్, మీర్‌పేట దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, టోలిచౌకి, చాదర్‌ఘాట్, చాంద్రాయణగుట్ట, ఆర్కేపురం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో అబ్దుల్లాపూర్‌మెట్ ఇనాంగూడ వద్ద జాతీయ రహదారిపైకి వరద చేరటం వల్ల ఆదివారం మధ్యాహ్నం వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రక్షణగా ఉంటూ వాహనాలను పంపుతున్నారు.
అయిదుగురి మృతి
ఉప్పల్ చిలుకానగర్‌లో సెల్లార్‌లో నీటిని తోడటానికి మోటార్ అమర్చుతూ శ్రీనివాస్(42) విద్యుదాఘాతంతో మరణించాడు. ఈనెల 13న గగన్‌పహాడ్ వద్ద గుర్రంచెరువు వరదలో కొట్టుకుపోయిన 8 మంది కుటుంబ సభ్యుల్లో అయాన్(7) మృతదేహాన్ని గుర్తించారు. సూరారం రాజీవ్ గృహకల్ప వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి(50), ఎల్బీనగర్ ఠాణా పరిధిలో మరో గుర్తుతెలియని వ్యక్తి(40) మృతదేహాలను కనుగొన్నారు. జూబ్లీహిల్స్ దుర్గా భవానీ నగర్ వద్ద సెల్లార్‌లోని గుంతలో పడి బాలుడు(4) మరణించాడు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 13లో భారీ ప్రహరీ కూలినా ప్రాణనష్టం తప్పింది.
వీధుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బోట్లు
జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బోట్లు రాజధాని వీధుల్లో రెస్క్యూ ఆపరేషన్లలో తలమునకలయ్యాయి. పదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సెంథిల్‌కుమార్ నేతృత్వంలో 170 మంది సిబ్బంది 5 బృందాలతోపాటు మరో 8 ఉపబృందాలు లోతట్టు ప్రాంతాలైన బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, టోలిచౌకి, రామిరెడ్డినగర్, ఫలక్‌నుమా, జిల్లెలగూడ, బాలాపూర్, రామంతాపూర్, బీఎన్‌రెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో బాధితులను తరలిస్తున్నాయి. శనివారం నాటికి సుమారు 5,000 మంది బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
సింగపూర్ టౌన్‌షిప్‌లో 19.7 సెం.మీ. వర్షం
శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ పలుచోట్ల కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా సింగపూర్ టౌన్‌షిప్‌లో 19.7, మేడిపల్లి, ఫీర్జాదీగూడల్లో 18, రాక్‌టౌన్‌కాలనీ (ఎల్‌బీనగర్)లో 17.2, భవానీనగర్ (సరూర్‌నగర్)లో 17, ఎల్‌బీనగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద 16.9, అల్కాపురి, కందికల్ గేటు వద్ద 16.3 సెం.మీ. వర్షం కురిసింది.
మళ్లీ భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఇది మంగళవారానికి మరింత తీవ్రం కావచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో 1500 మీటర్ల ఎత్తు వరకూ మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాజారావు తెలిపారు.
ఇదీ చూడండి: వరుణుడు పగబట్టాడా.. మరో భారీ వర్షసూచన