గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్టోబర్ ఫ్లడ్స్ అండ్ రిలీఫ్ వర్క్స్ పేరిట వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు చెందిన పూర్తి వివరాలు ఇందులో పొందుపరచాలని.. ఆర్థిక సహాయం పంపిణీలో పారదర్శకత పాటించేట్లు చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం పొందిన బాధితుల సంఖ్యపై ఇప్పటికీ ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆరోపించారు.
రూ.550 కోట్ల రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని క్షేత్ర స్థాయిలో సక్రమంగా పంపిణీ చేయడం లేదని నారాయణరెడ్డి ఆరోపించారు. ఈ ప్యాకేజీ తెరాస నాయకులు ఫొటోలకు ఫోజులు ఇచ్చుకోడానికి మాత్రమే ఉపయోగపడుతోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరంలో వరదల కారణంగా 1500 కాలనీలు ప్రభావితమైనట్లు అంచనా ఉందని, వరద బాధితులు లక్షల్లో ఉంటే.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందిన వారు మాత్రం వందల్లో ఉన్నారని విమర్శించారు. బాధితులందరికీ ఉపశమనం కల్పించినట్లు చూపించేందుకు తెరాస నాయకులు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికీ చాలా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందలేదని ఆయన ఆరోపించారు. తెరాస ప్రచారం కోసం కాకుండా నిజమైన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: తలసాని