CM KCR Review on Telangana Decade Celebrations : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పదేళ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లెపల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. అవతరణ దినోత్సవాల సందర్భంగా కార్యక్రమాల నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు.
ఎన్నో అవమానాలకు గురైన తెలంగాణ నేడు అద్భుతంగా వెలుగొందుతోంది : 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ రెండో తేదీన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భమన్న కేసీఆర్... ఒకనాడు అనేక అవమానాలకు, అపోహలకు గురైన తెలంగాణ నేడు అత్యద్భుతంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. విద్యుత్తు, వ్యవసాయంతో పాటు సాగునీరు సహా ప్రతి రంగంలో దేశానికే ఆదర్శంగా ప్రగతిని నమోదు చేసుకుంటూ పోతున్నదని అన్నారు. నేడు స్వయంపాలన ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్న ముఖ్యమంత్రి... పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లె పల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని తెలిపారు.
ఈ మూడు వారాల పాటు ప్రజలతో మమేకం కావాలి : ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణలో నేడు విద్యుత్ రంగాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతోందని... 24 గంటల విద్యుత్‌ను రైతాంగానికి ఉచితంగా, నిరంతరాయంగా అందిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఇదంతా ఎంతగానో కష్టపడితే తప్ప సాధ్యం కాలేదన్న ఆయన... ఇవే విషయాలను ప్రజలకు వివరించాలని అన్నారు. విద్యుత్ రంగం తరహాలో తెలంగాణ ప్రభుత్వం పటిష్టపరిచిన వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధిని పేరు పేరునా ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, మార్గాల ద్వారా చేరవేయాలని సీఎం కేసీఆర్ వివరించారు. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలతో ఈ మూడు వారాల పాటు మమేకం కావాలని సూచించారు.
ఆ అంశాలపై చర్చించిన సీఎం కేసీఆర్ : ప్రజల భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ది ఉత్సవాలను ఆటాపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రారంభ వేడుకల కోసం సచివాలయంలో స్టేజి ఏర్పాటు, పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఎగురవేయడం తదితర అధికార కార్యక్రమాలు నిర్వహణపై సీఎం చర్చించారు. ఆహ్వానితులకు పార్కింగ్ సౌకర్యం, అతిథులకు ‘హైటీ’ ఏర్పాటు వంటి కార్యక్రమాలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.
ఇవీ చదవండి: