తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని విజయవాడకు చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, తంగిరాల సౌమ్య, కార్యకర్తలు...ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నేరుగా ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
పార్టీ నేతలతో వర్చువల్ సమావేశం
అనంతరం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. "ఇసుక, సిమెంట్‌ను సొమ్ము చేసుకుంటూ వైకాపా నేతలు అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు పేదలకు నిర్మిస్తున్నారు. పేదలకు సిమెంట్, ఇసుక ఇచ్చి ఇళ్లు కట్టుకోమంటే సరిపోతుందా ?. ప్రభుత్వ గృహ నిర్మాణాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు. భూ సేకరణలో రూ.6500 కోట్లు దోచి, మౌలిక వసతుల పేరిట రూ.34 వేల కోట్ల మరో అవినీతికి తెర లేపారు. టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. గృహ నిర్మాణ బకాయిల్ని తక్షణమే విడుదల చేయటంతో పాటు నివాసయోగ్యమైన గృహాలను నిర్మించాలి. విద్యార్థులకు ఉపకార వేతనాలను తెదేపా ప్రభుత్వం అందిస్తే.. వైకాపా ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేయటంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను 2.47 కోట్ల నుంచి 60 లక్షలకు కుదించింది. కరోనాతో కుటుంబాల ఆదాయం తలకిందులైతే ధరల పెంచి ప్రజలపై పన్నుల భారం మోపారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని జగన్ రెడ్డి నిలబెట్టుకోవాలి." అని సమావేశంలో నేతలు ధ్వజమెత్తారు.
మంగళవారం సాధన దీక్ష
కొవిడ్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌పై సాధన దీక్ష పేరిట మంగళవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలకు తెలుగుదేశం పిలుపునిచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించే ఆందోళనలో పాల్గొననున్నారు. చంద్రబాబుతో పాటు మరో 15 మంది సీనియర్ నేతలు ఆందోళనలో పాల్గొననుండగా.. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. కొవిడ్ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు, కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలనే డిమాండ్‌తో తెదేపా దీక్షకు పిలుపునిచ్చింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి, జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: MP KOMATI REDDY: 'రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను'