అన్నా యూనివర్సిటీ అత్యాచారం కేసుపై సిట్ - బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం: మద్రాస్ హైకోర్ట్ - SIT ON ANNA UNIVERSITY GANG RAPE
చెన్నై విద్యార్థి అత్యాచారం కేసుపై సిట్ ఏర్పాటు - హిళా ఐపీఎస్‌లనే నియమిస్తూ మద్రాస్ హైకోర్టు


Published : Dec 28, 2024, 4:48 PM IST
SIT Probe On Anna University Gang Rape : అన్నాయూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు విచారణకు మద్రాసు హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులుగా మహిళా ఐపీఎస్‌లనే నియమిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారిణిలు స్నేహప్రియ, ఆయ్మన్ జమాల్, బృంద నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది.
డిసెంబర్ 23న అన్నాయూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. విద్యార్థినితో ఉన్న ఆమె స్నేహితుడ్ని తీవ్రంగా కొట్టి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసుల ఎఫ్‌ఐఆర్ లీకవడం వల్ల బాధితురాలి వ్యక్తిగత వివరాలు బయటకురావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేసును సుమోటాగా స్వీకరించింది మద్రాస్‌హైకోర్టు. అయితే, సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఎఫ్‌ఐఆర్ లీకై ఉండొచ్చని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
రూ.25 లక్షల పరిహారం
ఎఫ్‌ఐఆర్ లీకవడం వల్ల బాధితురాలికి జరిగిన నష్టానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కేసు వివరాలు మీడియాకు వెల్లడించినందుకు చెన్నై పోలీసు కమిషనర్‌పై అవసరమైతే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బాధితురాలికి చదువుకున్నన్ని రోజులు ఉచిత విద్య, బోర్డింగ్, లాడ్జింగ్, కౌన్సెలింగ్ సౌకర్యాలను కల్పించాలని అన్నాయూనివర్సిటీని హై కోర్టు ఆదేశించింది. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసుల్లో ఎఫ్‌ఐఆర్ లీకేజీ జరగకుండా చూసుకోవాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే!
అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. "ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు అనుగుణంగానే నిందితుడిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకున్నాం. మహిళా విద్య, హక్కుల కోసం డీఎంకే పార్టీ నిరంతరం కృషి చేస్తూనే ఉంది" అన్నారు.