2019 సంవత్సరానికి గానూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో వైద్యారోగ్య శాఖ పనితీరును విమర్శించింది. ఆసుపత్రులకు వెళ్లిన ప్రతిసారి రోగి వివరాలను, పూర్వపు వైద్య చరిత్ర తెలుసుకునే అవసరం లేకుండా... రోగి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రుల నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు పేర్కొంది. ఈ ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థ.. ఈహెచ్ఎంఎస్ పేరుతో రోగి డేటాను ఆన్లైన్లో పొందుపరిచేందుకు 2014లో రాష్ట్రంలోని గాంధీ, కింగ్‌కోఠి, మలక్‌పేట ఏరియా ఆసుపత్రుల్లో కేంద్రం పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. 24 నెలల వ్యవధికి రాష్ట్రప్రభుత్వంతో ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రతి రోగికి విశిష్ట ఎలక్ట్రానిక్ నంబర్ని ఇస్తారు. ఆ నంబర్ ఆధారంగా రోగికి చేసిన పరీక్షలు, చికిత్స సహా... ఆరోగ్య వివరాలు, కుటుంబంలోని హెల్త్ హిస్టరీ సహా పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.
అలసత్వం
అయితే మూడు ఆసుపత్రుల్లోనూ సుమారు 2016 నుంచి అనేక రకాల పరీక్షా ఫలితాలు అందుబాటులో ఉంచలేదని పేర్కొంది. మూడు ఆసుపత్రుల్లో కలిపి 22.47లక్షల రిజిస్ట్రేషన్లు, 1.51 లక్షల ఇన్‌పేషంట్ రికార్డులు, 0.38లక్షల కేసు షీట్లు ఉన్నప్పటికీ కేవలం మలక్ పేట ఏరియా ఆసుపత్రిలో ఒక్క రోగికి సంబంధించిన ఈఎంఆర్ రిపోర్టు మాత్రమే తయారు చేయడాన్ని ఆక్షేపించింది. ఇక ఎలక్ట్రానిక్ వైద్య డేటా నిర్వహణలో భాగంగా కొన్ని మాడ్యూళ్లలో ధ్రువీకరణ నియంత్రణలు లేకపోవటం సహా తప్పు డేటాను అంగీకరించినట్టు పేర్కొంది. రియల్‌టైం డేటా సంగ్రహణలో సిబ్బంది అసమర్థత, విముఖతను ఎత్తి చూపింది. ఇక రాష్ట్రంలో బయో మెడికల్ పరికరాల నిర్వహణ పనులను స్వీకరించిన ఓ తృతీయ పక్షం ఏజెన్సీ పనిలో అలసత్వం చూపినా ఆ సంస్థకు ప్రభుత్వం ఎక్కువకాలం అవకాశం ఇవ్వటాన్ని కాగ్ నివేదికలో పొందు పరిచింది.
ప్రతికూల ప్రభావం
2016లోనే ఓ సంస్థకు పరికరాల నిర్వహణ అప్పగించగా వైద్య పరికరాలను ఏజెన్సీ 12నెలలు ఆలస్యంగా ఆసుపత్రులకు అందజేసిన విషయాన్ని పేర్కొంది. అయితే పరికరాల మరమ్మతు విషయంలోనూ ఏజెన్సీ అలసత్వం ప్రదర్శిస్తూ... జాప్యం చేసినా... దీనిపై ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పలుమర్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం ఏజెన్సీతో 2019 వరకు ఒప్పందాన్ని కొనసాగించటం పట్ల కాగ్ పెదవి విరిచింది. పరికరాల నిర్వహణను అనుకున్న సమయానికి ఏజెన్సీ పూర్తి చేయకపోవటం వల్ల ఆసుపత్రుల్లో క్లిష్టమైన వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపినట్టు నివేదికలో పేర్కొంది.
అవకతవకలు
కాకతీయ విశ్వవిద్యాలయంలో సదుపాయల కల్పన లక్ష్యంతో కేయూలో నాలుగు నిర్మాణ పనులకు 2013లో అనుమతులు లభించాయి. అయితే నిర్మాణాలకు స్థలం కేటాయింపులో జాప్యం, అన్ని నిర్మాణ పనులకు విశ్వవిద్యాలయం ముఖ్యమైన మార్పులు చేయటం, నిధుల కొరతతో పనులు మొదలు పెట్టిన తర్వాత కొంత కాలానికి నిలిపివేశారు. ఫలితంగా రూ.1.61 కోట్ల నిధులు వృథా అయినట్లు కాగ్ పేర్కొంది. ఇక పీజీ సీట్ల పెంపుదలలో సైతం వైద్య ఆరోగ్య శాఖ పనితీరును కాగ్ తప్పు బట్టింది. పీజీ సీట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేయటం, ఉన్నతీకరించటం అనే కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఉస్మానియా.. గాంధీ సహా వరంగల్ కాకతీయ కళాశాల్లలో సీట్ల పెంపు చేపట్టాలని భావించారు. ఇందుకోసం ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75:25శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమయానికి నిధులు మంజూరు చేయకపోగా... కేంద్రం ఇచ్చిన నిధులను సైతం సరిగా వినియోగించలేదని, యూసీల సమర్పణలోనూ అవకతవకలు దొర్లినట్టు కాగ్ వెల్లడించింది.
లక్ష్యాలు నెరవేరలేదు
ఫలితంగా మూడు ఆసుపత్రుల్లో కలిపి 279 సీట్లు పెరగాల్సి ఉండగా కేవలం 60శాతం సీట్లు మాత్రమే పెరిగినట్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్యంపై ప్రభావం చూపే సాంక్రమికేతర వ్యాధులపై పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బహుళ అంశాల పరిశోధన యూనిట్లను కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ కళాశాల్లలో ఈ మేరకు పరిశోధనా యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధుల్లో జాప్యం సహా... టెండర్ ప్రక్రియలో జాప్యం, అత్యాధునిక పరికరాలు విదేశాల నుంచి కొనుగోలు చేయటంలో ఆలస్యం కారణంగా ప్రాజెక్టు మైలు రాళ్లను అందుకోవటం విఫలమైనట్టు పేర్కొంది. ఫలితంగా ప్రజారోగ్యంపై ప్రభావం చూపే సాంక్రమికేతర వ్యాధులపై పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యాలు నెరవేరలేదని స్పష్టం చేసింది.
ప్రాజెక్టుల నిర్వహణలో అలసత్వం, కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయానికి సమాచారం ఇవ్వటంలో విఫలమవటం సహా నిధుల కొరతకారణంగా రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో పీజీ సీట్ల పెంపు సహా.... పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యాలు నెరవేరలేదన్న కాగ్.. రోగుల ఆరోగ్య వివరాలకు సంబంధించి అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఆస్పత్రుల నిర్వహణ లోపాన్ని తీవ్రంగా పేర్కొంది.