కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తిలాంటి చట్టమని సీఎం కేసీఆర్ విమర్శించటం అర్థరహితమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. రైతులకు పూర్తి ప్రయోజనకారిగా ఉండే ఈ చట్టంపై లేనిపోని అనుమానాలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతులను అయోమయానికి గురిచెయడం భావ్యం కాదన్నారు. సీఎం కేసీఆర్కు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పూర్తి ప్రభుత్వ ఆధీనంలో 22వేల నూతన మార్కెట్లు వస్తున్నాయని, అందులో తెలంగాణలో వెయ్యి మార్కెట్లు కేంద్ర నిధులతోనే ఏర్పాటు కానున్నాయని లేఖలో పేర్కొన్నారు. గత యాసంగిలో వడ్ల కొనుగోలు సందర్భంగా ఐకేపీ కేంద్రాల్లో వడగండ్ల వానకు రైతులు నష్టపోయిన విషయం వాస్తవమా.. కాదా.. అని సీఎం కేసీఆర్ను బండి సంజయ్ ప్రశ్నించారు. లాక్డౌన్ కాలంలో తెలంగాణలో పండ్లు, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు.
దేశంలో విస్తృత నియంత్రణలతో కూడిన వ్యవసాయ మార్కెట్ల చెర నుంచి విముక్తి ప్రసాదించే చారిత్రక బిల్లుగా కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ఉందని ఆయన అభివర్ణించారు. వ్యవసాయ ఒప్పందాలపై రైతులకు రక్షణతోపాటు, సాధికారత కల్పించే వ్యవస్థ ఏర్పాటును ఈ చట్టం ప్రతిపాదిస్తోందన్నారు. రైతులు ప్రత్యక్షంగా విక్రయాల్లో భాగస్వాములవుతారు కాబట్టి దళారుల బెడద తగ్గిపోయి పూర్తి స్థాయిలో లాభసాటి ధర లభిస్తుందన్నారు. మొత్తంగా రైతుకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుందన్నారు. ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో రైతులకు, వ్యాపారులకు ఎంపిక స్వేచ్ఛతోపాటు పోటీతత్వంతో కూడిన ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల ద్వారా గిట్టుబాటు ధరల లభ్యతకు వీలున్న వాతావరణాన్ని సృష్టించడమే రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక (ప్రోత్సాహం-సౌలభ్యం) బిల్లు-2020 ప్రధాన లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు.
ఇవీ చూడండి: తేనెపూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు: కేసీఆర్