సేద్యంలో నూతన పోకడలను ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో.... ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య కలిసి సదస్సు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ప్రాంగణంలో "అగ్రిటెక్ సౌత్ - 2020" సదస్సు, ప్రదర్శన సాగుతోంది. మూడు రోజులపాటు జరిగే సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అగ్రివిజన్ ప్రదర్శనలో మొత్తం 75కు పైగా స్టాళ్లు కొలువుదీరాయి. వ్యవసాయ, ఉద్యాన శాఖలతోపాటు అనేక సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచాయి. ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, సరికొత్త వంగడాల గురించి తెలుసుకునేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
వ్యాపార ఉత్పత్తులే...
వ్యవసాయంలో కూలీల కొరత అధిగమించేందుకు ట్రాక్టర్లు, వరినాటు, కోత, నూర్పిడి, పిచికారీ యంత్రాలు, సూక్ష్మ సేద్యం, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ టెక్నాలజీ ఇతర ఆవిష్కరణలు ప్రదర్శిస్తున్నారు. ఎన్నో కష్టనష్టాలతో కూడుకున్న వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు తమవంతు కృషిచేస్తున్నట్లు పారిశ్రామిక వర్గాలు తెలిపాయి.
రైతుల్లో భరోసా నింపేందుకే...
నష్టాలతో సేద్యం వీడుతున్న రైతుల్లో... భరోసా నింపేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని సదస్సు నిర్వాహకులు చెబుతున్నారు. వ్యవసాయాన్ని ఎలా సులువుగా చేయవచ్చు. నికర లాభాలు పొందడమెలా?... నవీన పద్ధతులేంటి?.. తదితర అంశాలను రైతులకు చేరవేయడమే సదస్సు ముఖ్యోద్దేశమని వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్ రావు తెలిపారు.
సదస్సు ముగిశాక చర్చనీయాంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ప్రదర్శనకు 15వేలకు పైగా రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: అధ్యక్షుడి పూర్తి షెడ్యూల్ ఇదే