తోపుడుబండిపై కూరగాయలు విక్రయిస్తున్న ఈ అమ్మాయి పేరు పిట్టతలపుల జ్యోతి. రాజీవ్ గాంధీనగర్‌లో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. ఆరుగురు సంతానంలో రెండో అమ్మాయి అయిన జ్యోతి... ఘట్కేసర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతుండగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయింది. హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్న జంగయ్యతో 2013లో జ్యోతి పెళ్లయింది. అప్పటి నుంచి భార్యభర్తలిద్దరూ చెరో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇరుగుపొరుగు పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఇంటి అద్దె, పిల్లల పోషణ చూసుకునేది.
తల్లకిందులైన ఆర్థిక పరిస్థితి
లాక్డౌన్ వల్ల జ్యోతి-జంగయ్యల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. జంగయ్యకు పెయింటింగ్ పనిలేదు. జ్యోతి టూషన్‌కు పిల్లలు రావడం లేదు. వంట పనికి పిలిచినవారు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో కుటుంబపోషణ భారమైంది. ఇంటి అద్దె కూడా చెల్లించలేని దయనీయ స్థితి. దిక్కుతోచని స్థితిలో బతుకుబండి గాడిన పడేందుకు కూరగాయలు అమ్మాలని నిర్ణయించుకుంది. మొదట్లో కూరగాయలు విక్రయించేందుకు ఇబ్బంది పడిన జ్యోతి.... తర్వాత అలవాటు చేసుకుంది. ఓపెన్ డిగ్రీ ఫీజు కట్టి మళ్లీ చదువు ప్రారంభించింది. రైల్వేలో ఉద్యోగం సంపాదించి... తన పిల్లలు తనలా కాకుండా బంగారు భవిష్యత్తు అందిస్తానని చెబుతోంది జ్యోతి.
భర్త అండతో...
ఓ వైపు కుటుంబపోషణ... మరోవైపు చదువుకోవాలనే తపనతో ఉన్న జ్యోతికి ఆమె భర్త జంగయ్య అండగా నిలుస్తున్నాడు. దాతలెవరైనా ఆదుకుంటే తన భార్య కల సాకారం చేసేందుకు శ్రమిస్తానంటున్నాడు.
భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా... కుటుంబ పోషణకు కూరగాయల విక్రేతగా అరడజనుకుపైగా పనులు చేస్తోన్న జ్యోతి... జీవన పోరాటంలో వెలుగు కోసం తపిస్తోంది. దాతలు ఆదుకుంటే చదువుకొని ఉద్యోగం సంపాదిస్తానని ధీమాతో ఉన్న జ్యోతి గురించి తెలిసిన వారు తమ పిల్లలకు ఆమెను ఆదర్శంగా చూపిస్తున్నారు.
ఇదీ చదవండి: కడుపుకోత.. నలుగురు అన్నదమ్ములు జలసమాధి