ట్యూషన్ మాస్టారుపై ప్రేమ.. ఘనంగా సన్మానించిన 500 మంది విద్యార్థులు - మాస్టారి శిష్యులు
Panchamukhi Tuition Master : ఆ ఉపాధ్యాయుడిని సన్మానించుకోవడానికి దేశ, విదేశాల నుంచి శిష్యులు తరలివచ్చారు. ఆయనకు సన్మానం అని ఆ విద్యార్థులకు తెలిసిన వెంటనే విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని వాలిపోయారు. కేవలం ట్యూషన్ చెప్పారనే కారణంతో 500 మంది విద్యార్థులు ఆ గురువును సత్కరించుకున్నారు. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
Panchamukhi Tuition Master : ఆయన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాదు.. విశ్రాంత అధ్యాపకులు కాదు.. ముదిమి మీద పడిన సాధారణ ట్యూషన్ మాస్టర్. పంచముఖి ట్యూషన్ మాస్టర్‌గా పేరుగాంచారు. బ్రహ్మచారి.. ట్యూషన్ ఫీజులు తీసుకోకుండా సుమారు 40 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచితంగా బోధన చేస్తున్నారు. అలాంటి గురువును దేశ విదేశాలకు చెందిన శిష్య బృందం సత్కరించి తమ గురుభక్తిని చాటుకున్నారు. తమకు ఆ ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలతో పాటుగా.. జీవిత పాఠాలను నెమరు వేసుకున్నారు. తమ జీవితంలో ఈ మార్పునకు కారణం ఆ మాస్టార్ చలవేనంటూ వెల్లడించారు. తమ బాల్య జ్ఞాపకాలను తోటి స్నేహితులతో పంచుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొంకాపల్లికి చెందిన తాత సుబ్రమణ్య.. పంచముఖి ట్యూషన్ మాస్టర్‌గా పేరుగాంచారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. వివాహం చేసుకుంటే వ్యక్తిగత బంధాలు, స్వార్థాలు ఏర్పడతాయనే భావంతో వివాహం చేసుకోకుండా తన వద్ద శిష్యరికం చేసిన పిల్లలను తన బిడ్డలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పించారు. అలాంటి గురువును కొంకపల్లి సమీపంలోని పేరూరులో ఏర్పాటు చేసిన సన్మాన సభలో సుమారు 500 మంది విద్యార్థులు అత్యంత ఘనంగా సత్కరించారు. అమెరికాలో ఉంటున్న శిష్యులే కాకుండా.. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై తదితర దూర ప్రాంతాల్లో వేరువేరు ఉద్యోగాల్లో స్థిరపడిన శిష్య బృందం రెక్కలు కట్టుకుని పేరూరు వచ్చి అభిమాన గురువు పంచముఖి మాస్టారును ఘనంగా సన్మానించారు. దాదాపు 40 సంవత్సరాల అనంతరం కలిసిన శిష్య బృందం గురువును చూసి తన్మయం చెందారు. అలాగే మిత్రులు స్నేహభావంతో కుటుంబాలతో వచ్చి ఆత్మీయ అనురాగాలను నెమరు వేసుకున్నారు.
'నా వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థులందరూ దేశ, విదేశాల్లో ఉండటం నాకు ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానంలో ఉండటం ఆనందాన్ని ఇచ్చింది. వీళ్లను చూస్తే నాకు పిల్లలు లేరన్న బాధ ఉండదు. నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి.' -పంచముఖి, ట్యూషన్ మాస్టర్
'గురువుగారు మాకు దేవుడితో సమానం. గురువుగారు మాకు విద్య నేర్పడమే కాదు, మంచి బుద్ధులు సైతం నేర్పించారు. ఆయన వల్లే మేము ఇలాంటి ఉన్నత స్థితిలో ఉన్నాం. గురువు గారు అందరినీ ఒకే రకంగా చూసేవారు. ఆయన కర్మయోగి. మాస్టార్ చెప్పే విధానం అందరికీ అర్థమయ్యేట్లుగా ఉంటుంది. ఆయన వద్ద విద్యనేర్చుకున్న విద్యార్థులు అమెరికా, కెనడా, జపాన్ లాంటి దేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇలాంటి గురువును జీవితంలో మళ్లీ చూడటం కష్టం.'- శిష్యులు
ఇవీ చదవండి: