Dalit Bandhu Allocations: 2022-23 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రూ.2,56,958,51 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దళిత బంధు కోసం గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలుచేస్తోందని తెలిపారు. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం ఆఖరునాటికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హరీశ్‌రావు వెల్లడించారు.
పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు..
వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు తగ్గించినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్తగా చేరిన లబ్ధిదారులకు పింఛన్లను అందజేస్తామని పేర్కొన్నారు. ఆసరా పింఛన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో రూ.11,728 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.
గొర్రెల పంపిణీ కోసం రూ.1000 కోట్లు..
గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అందులో భాగంగా 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం వేయి కోట్ల రూపాయలు కేటాయింపులు చేసినట్లు చెప్పారు.
నేతన్నలకు ఐదు లక్షల బీమా...
రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించినట్లు శాసనసభలో హరీశ్‌రావు వెల్లడించారు. రైతు బంధు పథకం తరహాలో నేత కార్మికుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించాలని నిర్ణయించిందని తెలిపారు.
లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్లు..
గీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. మొదటి విడతలో లక్ష మంది కార్మికులకు సబ్సిడీ కింద మోటార్ సైకిళ్లను ఇవ్వాలని బడ్జెట్‌లో ప్రతిపాదించామని.. త్వరలో విధివిధానాలను ప్రకటిస్తామన్నారు.
ఇవీచూడండి: