ETV Bharat / state

'ఒకప్పుడు చేపలమ్మేది.. ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారవేత్త' - Shri Malhari Masalas

కుటుంబ పోషణ కోసం ఆ అమ్మాయి తల్లితో కలిసి.. చేపలమ్మింది. ముగ్గురు అమ్మాయిల్లో పెద్దమ్మాయిగా బాధ్యతలన్నీ భుజాన వేసుకుంది. జీవితంలో మరేదో సాధించాలని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ‍ఓ మహిళగా విమర్శలు, ఆటుపోట్లు ఎదురైనా.. వాటన్నింటికి ఎదురు నిలిచి మల్హరి మసాలాస్ పేరుతో ఆర్గానిక్ పుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసింది. అనతి కాలంలోనే కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ... 5 ఏళ్లుగా దిగ్విజయంగా ముందుకు సాగుతోందీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన వినోదా చందావత్.

Special story on Shri Malhari Masalas And Organic Foods MD Vinoda Chandawat
సామాజిక వర్గంతో కాదు... ప్రతిభతో సాధించా..
author img

By

Published : Jul 4, 2022, 10:42 PM IST

సామాజిక వర్గంతో కాదు... ప్రతిభతో సాధించా..

వినోదా చందావత్. నేటి తరం వ్యాపారవేత్త. ఈ పేరు తెచ్చుకోడానికి ఎన్నో రోజులు శ్రమించింది. మరెన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడింది. 2016లో మల్హరి మసాలాస్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టిన వినోదా 13 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. తెలుగురాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం మసాలాలు ఎగుమతి చేస్తూ శభాష్ అనిపించుకుంటుంది. నమస్తే కిచెన్ పేరుతో మరో అంకుర సంస్థ ప్రారంభించి రుచికరమైన ఆహారం అందించేందుకు సిద్ధమైంది.

నిరుపేద కుటుంబంలో పుట్టిన వినోద. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో పెద్దది. కుటుంబ పోషణ కోసం చేపలమ్ముతున్న తల్లిదండ్రులకు తోడుగా నిలిచింది. డిగ్రీ పూర్తి చేసిన వినోద హైదరాబాద్‌ లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. కానీ సామాజిక వర్గంతో కాక తానేంటో నిరూపించుకోవాలనుకుంది. వెంటనే తనలక్ష్యం ఉద్యోగం కాదు..వ్యాపారం అని గ్రహించి ముందడుగు మల్హారీ మసాలాస్‌ పేరుతో వ్యాపారం ప్రారంభించింది.

మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా చదివించారు. కుమారుడు అయితేనే చేయగలుగుతారా.. నేనైతే చేయలేనా.. అనే నిర్ణయంతో.. చేపల వ్యాపారం చేశా.. తర్వాత మల్లారీ మసాలస్ పేరుతో వ్యాపారం చేశాను. - వినోద, మల్హరి మసాలాస్ వ్యవస్థాపకురాలు

వినోద మొదటగా సాప్ట్‌వేర్ ఉద్యోగులకు ఆహారం అందించే డబ్బా వాలా కాన్సెప్ట్‌ ప్రారంభించింది. అందులో నష్టాలు వస్తున్నాయని మసాలా వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని మల్హరి మసాలాస్ పేరుతో ప్రాజెక్టు సిద్ధం చేసింది. వ్యాపారం చేయడానికి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగింది. బ్యాంకర్లు రుణం ఇవ్వడానికి వెనకడుగు వేసినా.. వారిని ఒప్పించి 42 లక్షల రూపాయల రుణాన్ని పొందింది. వాటితో పాటు మరింత డబ్బు సేకరించి మల్హరి మసాలా వ్యాపారాన్ని స్థాపించింది.

ఏ వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా సరే.. ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. 92 లక్షలకు ప్రాజెక్టు రిపోర్టు పెట్టాను. వాళ్లు అనుమతి ఇవ్వలేదు. బ్యాంకర్స్ నాకు 42 లక్షలు ఇచ్చారు. బ్యాంకర్స్ ఇచ్చిన లోన్ ఒకటైతే.. ఇంట్లో, ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం మరొక ఎత్తైంది. మొత్తానికి కోటికి పైగా కంపెనీలో పెట్టాను. - వినోద, మల్హరి మసాలాస్ వ్యవస్థాపకురాలు

ఎట్టకేలకు వ్యాపారంలో అడుగేసిన వినోద. మొదటి ఏడాదంతా మార్కెట్‌ను అధ్యయనం చేసి.. ఉచితంగానే తన ఉత్పత్తులను పంచేది. అవి కాస్త జనాలకు నచ్చడంతో ప్రస్తుతం 24 రకాల మసాలాలు సరఫరా చేస్తోంది. ఇందుకోసం చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకొంది. స్థానికంగా ఉండే 13 మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. ఆర్గానిక్ ఉత్పత్తులకే పెద్దపీట వేస్తూ..... నాణ్యమైన మసాలాలను వినియోగదారులకు అందజేస్తుంది. ఉద్యోగం చేస్తే వచ్చే ఆనందం కంటే... ఉద్యోగాలు కల్పించే దిశగా చేసే ప్రయత్నాలు తనకు ఆనందం ఇస్తున్నాయని వినోద అంటోంది. మహిళలు తలుచుకుంటే ఎక్కడైనా రాణించగలరని నిరూపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మసాలా బ్రాండ్ లతో పోటీ పడకపోయినా వాటి పక్కన నిలబడేందుకు కృషి చేస్తున్నట్లు వినోద చేబుతోంది.

ఒకప్పుడు పొట్టకూటి కోసం చేపలు అమ్మిన అమ్మాయి... నేడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుందంటే చిన్న విషయం కాదు. ఒక్కో అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తూ పోటీ వాతావరణాన్ని తట్టుకుంటూ ముందుకు సాగుతోన్న వినోద... మల్హరి మసాలాస్ తోపాటు నమస్తే కిచెన్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.