Gavaskar comments on Rahane Pujara: ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న టీమ్‌ఇండియా సీనియర్ బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇక టెస్టు క్రికెట్‌లో కొనసాగాలంటే చివరగా ఒక్క అవకాశమే మిగిలి ఉందని మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. జట్టులో కొనసాగాలంటే రెండో ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మరోసారి విఫలమవడం వల్ల ఈ వ్యాఖ్యలు చేశాడు.
"పుజారా, రహానే వరుస బంతుల్లో విఫలమవ్వడం చూస్తే.. సగటు వ్యక్తి ఎవరైనా.. వాళ్లు టెస్టుల్లో కొనసాగడానికి ఇక ఒక్క అవకాశమే మిగిలి ఉందని అనుకుంటారు. జట్టులో వారి స్థానాలపై ఇప్పటికే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమవ్వడం విచారకరం. ఇకపై వాళ్లు టీమ్ఇండియాలో కొనసాగాలంటే రెండో ఇన్నింగ్స్‌లో బాగా ఆడటం ఒక్కటే వారు చేయాల్సింది" అని గావస్కర్ అన్నారు.
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మరోసారి విఫలమయ్యారు. ఒలీవర్ వేసిన ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో పుజారా (3), రహానె (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. దీంతో వీరిద్దరిపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క భారీ ఇన్నింగ్స్ లే!
పుజారా శతకం చేసి మూడేళ్లు కాగా.. రహానే గతేడాది మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేశాడు. అప్పటి నుంచి మరో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో వీరిద్దరి స్థానాలపై ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావాలని చూస్తున్నాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానె తప్పక రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా విఫలమైతే ఇక మూడో టెస్టులో వీరిద్దరు ఆడటం కష్టమనే చెప్పొచ్చు.