Shoaib Akhtar On Virat Kohli : వంద సెంచరీలు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ మార్క్‌ను అందుకొన్న ఏకైక ఆటగాడు టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ తెందుల్కర్. టెస్టుల్లో 51, వన్డే ఫార్మాట్‌లో 49 శతకాలు బాదేశాడు. అతడి తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 (టెస్టుల్లో 41, వన్డేల్లో 30) దగ్గరే ఆగిపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (టెస్టుల్లో 27, వన్డేల్లో 43) 70 శతకాలతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో కోహ్లీ మాత్రమే టాప్-10లో ఉన్నాడు. కోహ్లీ తర్వాత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (44), డేవిడ్ వార్నర్ (43), రోహిత్ శర్మ (41) చాలా దూరంలో ఉండటం గమనార్హం.
అయితే మూడేళ్ల కిందట వరకు విరాట్ ఫామ్‌ను చూస్తే సచిన్ 'వంద' వందల రికార్డును అవలీలగా తుడిచేస్తాడని అంతా భావించారు. కానీ 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలోనూ విరాట్ ఒక్క సెంచరీని కొట్టలేకపోయాడు. చివరిసారిగా బంగ్లాదేశ్‌పై శతకం బాదిన కోహ్లీ.. రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్‌ను కూడా అధిగమించలేకపోయాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించడం కష్టంతో కూడుకున్నదేనని.. అయితే విరాట్ ఫామ్‌లోకి వస్తే మాత్రం సాధ్యమయ్యే అవకాశం లేకపోలేదని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు.
"విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడిగా మారిపోయావు. పరుగులు చేస్తున్నప్పటికీ ఇంకో 30 సెంచరీలు సాధించాలంటే ఇప్పుడు చాలా కష్టమే. సుదీర్ఘ ఫార్మాట్‌లో క్రీజ్‌లో కుదురుకోవడానికి సమయం ఉంటుంది. ఇక్కడ (టీ20ల్లో) ప్రయత్నిస్తున్నప్పటికీ స్ట్రైక్‌రేట్ కొనసాగించాలి. అదేవిధంగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలి. అయితే కోహ్లీ పాజిటివ్‌గా ఉంటాడు. దూకుడుగా ఆడగలడు. అందుకే విరాట్ వంద సెంచరీలు చేయాలని కోరుకుంటా. ఇప్పటి పరిస్థితులను చూస్తే అసాధ్యంగా అనిపిస్తోంది. కానీ విరాట్ చేయగలడనే నమ్మకమూ ఉంది. ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచుల్లో అతడి ఆటలో సాధికారిత లేదు. బంతి బ్యాట్‌కు మిడిల్‌లో తాకడం లేదు. అందుకే వచ్చే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్ గురించి కూడా ఆలోచించాలి. ఈ ఫార్మాట్‌కు సరిపోతానా..? లేదా..? అనేది అతడికే తెలుస్తుంది. ఎందుకంటే మిగిలిన కెరీర్‌లో ఇంకో 30 శతకాలు బాదాల్సిన అవసరం ఉంది" అని షోయబ్ అక్తర్ వివరించాడు. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఇవాళ భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.
ఇవీ చదవండి: ఓపెనర్లు దూకుడు.. కోహ్లీ హాఫ్ సెంచరీ.. పాక్ లక్ష్యం ఎంతంటే?