టీమ్‌ఇండియాపై పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించే రోజుల్లో మ్యాచ్‌లు పూర్తయ్యాక భారత ఆటగాళ్లు తమను క్షమించమని అడిగేవారని ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిదీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా క్రిక్‌కాస్ట్ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన పాక్ మాజీ క్రికెటర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే తన కెరీర్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లపై ఆడటం ఎంతో ఆస్వాదించేవాడినని చెప్పుకొచ్చాడు.
"టీమ్‌ఇండియాపై ఆడటం ఎప్పుడూ ఆస్వాదించేవాడిని. మేం వాళ్లని ఎన్నోసార్లు చాలా తేలిగ్గా ఓడించాం. దాంతో మ్యాచ్‌లు పూర్తయ్యాక వాళ్లొచ్చి మమ్మల్ని క్షమాపణలు కోరేవారు. అలా భారత్, ఆస్ట్రేలియా జట్లతో ఆడి బాగా ఎంజాయ్ చేశా. ఆ రెండు ఉత్తమ జట్లు కాబట్టి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆయా దేశాలకు వెళ్లి అక్కడి పరిస్థితుల్లో ఆడటమనేది చాలా పెద్ద విషయం."
-అఫ్రిదీ, పాక్ మాజీ క్రికెటర్
ఇక టీమ్‌ఇండియాపై తన అత్యుత్తమ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ 1999లో చెన్నై టెస్టులో శతకం సాధించినట్లు గుర్తుచేసుకున్నాడు. అదే తన మేటి ఇన్నింగ్స్ అని వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో 42/2తో ఉన్న పాకిస్థాన్‌ను అఫ్రిదీ ఆదుకున్నాడు. దాంతో ఆ జట్టు 286 పరుగులు సాధించింది. "టీమ్‌ఇండియాపై నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ఇన్నింగ్స్ అదే. ఆ రోజు 141 పరుగులు చేశా. ఆ పర్యటనలో వసీమ్ భాయ్, చీఫ్ సెలెక్టర్ నాకు అండగా నిలిచారు. అదెంతో కష్టతరమైన పర్యటన. అయితే, ఆ ఇన్నింగ్స్ మాత్రం చాలా ముఖ్యమైంది" అని మాజీ క్రికెటర్ వివరించాడు.