'బోర్' కొట్టిస్తేనే టీమ్‌ఇండియాను కొట్టగలం! - grame swann jack leach
టీమ్‌ఇండియాపై విజయం సాధించాలంటే స్పిన్నర్ జాక్ లీచ్ 'బోరింగ్' లైన్ అండ్ లెంగ్త్‌ను అనుసరించాలని ఇంగ్లాండ్ గ్రేమ్‌స్వాన్ సూచించాడు. ప్రపంచంలోనే టీమ్‌ఇండియా ఉత్తమ జట్టని కితాబిచ్చాడు.
టీమ్‌ఇండియాపై విజయవంతం అవ్వాలంటే స్పిన్నర్ జాక్ లీచ్ 'బోరింగ్' లైన్ అండ్ లెంగ్త్‌ను అనుసరించాలని ఆ జట్టు మాజీ ఆటగాడు గ్రేమ్‌స్వాన్ సూచించాడు. భారత్‌పై గత అనుభవం లేకపోవడం లీచ్, డామ్ బెస్‌కు సవాలేనని పేర్కొన్నాడు. 2012లో సిరీసులో స్పిన్నర్లు స్వాన్, మాంటీ పనేసర్ కీలక పాత్ర పోషించారు.
"జాక్ లీచ్‌ను మీరెలా చూస్తే అలా కనిపిస్తాడు. అతడో ఎడమ చేతివాటం స్పిన్నర్. రన్నప్ చేసి బంతిని స్టంప్స్‌పై పిచ్ చేస్తాడు. శ్రీలంక కోసం హెరాత్ ఏం చేశాడో చూడమని నేనతడికి చెబుతున్నా. లీచ్‌కు ఇదే బ్లూప్రింట్. భారత్‌లో ఆడుతున్నంత వరకు బోరు కొట్టేలా ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బంతి విసరాలి. టీమ్‌ఇండియా ఆటగాళ్లు మంచి బంతులను గౌరవిస్తారు. లీచ్ సైతం ఎక్కువ చెత్త బంతులు వేయడు. టీమ్‌ఇండియా క్రికెటర్లు సుదీర్ఘంగా ఆడగలరు కాబట్టి అతడికీ లయ దొరుకుతుంది. ఒక ఎండ్‌కు పరిమితమై కచ్చితంగా నిలకడతో అతడు బంతులు వేయగలడు" అని స్వాన్ తెలిపాడు.
డామ్ బెస్ నుంచి మాత్రం లీచ్ తరహా నిలకడను ఆశించడం లేదని స్వాన్ అన్నాడు. అతడింకా యువకుడే అని ఎక్కువ ఓవర్లు విసరలేదని పేర్కొన్నాడు. కాకపోతే అతడు వికెట్లు తీయగలడని సూచించాడు. "బెస్ శ్రీలంకలో బాగా బౌలింగ్ చేయలేదు. ఈ విషయాన్ని అతడూ అంగీకరిస్తాడు. అయితే 12 వికెట్లు తీశాడు" అని తెలిపాడు. 2012లో తాము టీమ్‌ఇండియాను ఓడించామని స్వాన్ గుర్తు చేసుకున్నాడు. దాన్నుంచి నేర్చుకున్న పాఠాలను తర్వాతి సిరీసులో పట్టించుకోకపోవడం వల్ల 4-0తో క్లీన్‌స్వీప్ అయ్యామని వివరించాడు. అప్పుడు తమ దృష్టంతా ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీసుపైనే ఉందన్నాడు. ఏదేమైనా ఇప్పుడు టీమ్‌ఇండియా ప్రపంచవ్యాప్తంగా బాగా ఆడుతోందని ప్రశంసించాడు.
ఇదీ చూడండి: అలా బౌలింగ్ చాలా కష్టంగా ఉంది: బుమ్రా