వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన టీమిండియా పేసర్ భువనేశ్వర్.. మళ్లీ ఎప్పుడు జట్టులోకి వస్తానో తెలియదని చెప్పాడు. గాయంపై సందిగ్ధత నెలకొందని, ఇందుకు సంబంధించిన చికిత్స కోసం జరుగుతున్న జాప్యంలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)ని నిందించనని అన్నాడు.
" టీ20 ప్రపంచకప్ కోసం ఇంకా తొమ్మిది నెలల సమయముంది. దాని గురించి అప్పుడే ఆలోచించడం లేదు. గాయం నుంచి కోలుకోవడమే నా తొలి ప్రాధాన్యం. అయితే ఎప్పుడు కోలుకుంటాననేది తెలియదు. నా పరిస్థితిపై ఎన్‌సీఏ బాగానే ప్రయత్నించి ఉండొచ్చు. అయితే అక్కడేం జరిగిందో తెలీదు, వాళ్లు నా సమస్యను గుర్తించలేకపోయారు. ఈ విషయంపై నేను మాట్లాడటం సరికాదు. బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా"
-- భువనేశ్వర్ కుమార్, క్రికెటర్
ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే ఎన్‌సీఏకు వెళ్లడం సరైనదేనా అని అడిగిన ప్రశ్నకు... అది వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పాడు భువీ. తన గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స అవసరమో కాదో తెలియదని, వైద్య నిపుణులను సంప్రదించాకే పునరాగమనంపై స్పష్టత వస్తుందన్నాడు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న ఈ పేసర్... కుటుంబంతో చాలా సమయం గడుపుతున్నానని, మ్యాచ్‌లు ఉంటే ఇలాంటి సమయం దొరకదని వివరించాడు.
ఇదీ చదవండి: రషీద్‌ఖాన్ 'క్యామెల్' బ్యాట్ చూశారా..!