ప్రపంచంలో అత్యంత అందగత్తె ఎవరనే విషయంపై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఓ సౌందర్య నిపుణుల బృందం చేసిన తాజా అధ్యయనంలో.. అమెరికన్ సూపర్ మోడల్ బెల్లా హదీద్‌కే అగ్రస్థానం దక్కింది.

కచ్చితమైన కొలతలు...
సౌందర్యాన్ని లెక్కలు కట్టడానికి 'గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ పై' అనే కొలమానాన్ని ఉపయోగిస్తుంటారు. దీని ఆధారంగా చూస్తే భూమ్మీద ఉన్న వారందరిలో అందమైనది ఈ విక్టోరియా సూపర్ మోడలే అని తేల్చారు సౌందర్య నిపుణులు. చెక్కినట్లుండే బెల్లా ముఖం పర్‌ఫెక్షన్‌కు దగ్గరగా ఉందట.
ముఖ కవళికల ప్రకారం అందానికి శాస్త్రీయ నిర్వచనం ఇవ్వడానికి ప్రాచీన గ్రీస్ శాస్త్రజ్ఞులు సూచించిన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు నిపుణలు. ఈ కొలతల ప్రకారం ఈ అమ్మడు ముఖానికి 94.35 శాతం మార్కులు పడ్డాయట.

ఈ అందాల భామ తర్వాత స్థానాన్ని 92.44 మార్కులతో పాప్ సంచలనం బియాన్స్ నోల్స్ కొట్టేసింది. హాలీవుడ్ తార ఆంబర్ హర్ద్ అందానికి 91.85 మార్కులు పడి ముచ్చటగా మూడో ర్యాంకు తెచ్చుకోగా, వరుసలో తర్వాత నిలబడిన అమెరికన్ గాయని అరియానా గ్రాండేకు 91.81 మార్కులిచ్చారు.
లండన్‌లోని ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. బెల్లా హదీద్ ముఖంలో భాగాలన్నీ పరిపూర్ణతకు దగ్గరగా ఉన్నాయని, నిస్సందేహంగా ఆమే ప్రపంచ సుందరి అని చెప్పవచ్చని బృందం తెలిపింది. కచ్చితమైన రీతిలో తీర్చిదిద్దినట్లున్న ఆమె చుబుకం అయితే నూటికి 99.7 పాయింట్లు గెలుచుకుందని జూలియన్ విశ్లేషించారు.