Theatre re open: తెరపై 'బొమ్మ' పడేనా? - Theatres latest news
థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేసింది. అయితే పలు సమస్యలు థియేటర్లను, ప్రదర్శకారులను వెంటాడుతున్నాయి. దీంతో చిత్రాల విడుదల ఉంటుందా? లేదా అనే సందేహం వస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లకు అనుమతులు లభించేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ఎలాంటి నిబంధనలు విధించకుండా వందశాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని చెప్పేసింది. సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా థియేటర్లకు పచ్చజెండా ఊపింది. ఇక బొమ్మ పడటమే ఆలస్యం. ఈ నెల 15 నుంచి కొత్త సినిమాలు విడుదల షురూ కావొచ్చని అంచనా వేస్తున్నారంతా. మరి అందరూ ఆశిస్తున్నట్టుగా సినిమా సందడి మొదలవుతుందా? ఈ ప్రశ్నకు పలు సందేహాలు సమాధానంగా వినిపిస్తున్నాయి.
తెలుగు చిత్రసీమ రెండు రాష్ట్రాలతో ముడిపడింది. రెండు చోట్లా సినిమాలు విడుదలైతేనే నిర్మాతలకు గిట్టుబాటు అవుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం థియేటర్లకు అనుమతులు ఇచ్చినా కొత్త సినిమాలు మాత్రం విడుదల కాలేదు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో కూడా 50 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని ఆ ప్రభుత్వం సూచించడం వల్ల సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది. రెండో దశ కరోనాతో రెండు నెలలకుపైగా మూతపడిన థియేటర్ల దగ్గర మళ్లీ పూర్వ సందడిని ఊహిస్తున్నారు సినీ ప్రియులు, పరిశ్రమ వర్గాలు. ఇప్పటికిప్పుడు అగ్ర తారలు సినిమాలు విడుదల కాకపోయినా.. పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాల్ని ప్రదర్శించొచ్చు. కానీ ప్రదర్శనకారులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలతో ప్రభుత్వాల ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరి వాళ్ల సమస్యలపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనే విషయమే కీలకం.

టికెట్ రేట్లపై ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల విషయంలో నిర్మాతల్లోనూ, ప్రదర్శనకారుల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏప్రిల్‌లో సినిమా టికెట్ ధరల్ని తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. ఆ ధరలతో ప్రదర్శనలు నిర్వహిస్తే భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాల వసూళ్లపై ప్రభావం పెద్దయెత్తున పడుతుంది. పైగా 50 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలంటే ఇంకా కష్టం. అందుకే ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యల్ని తీసుకెళ్లాలని సినీ వర్గాలు నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణలోనూ తమకు తీరాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ప్రదర్శనకారులు చెబుతున్నారు. థియేటర్ల దగ్గర పార్కింగ్ రుసుములు మొదలుకొని... లాక్‌డౌన్ సమయంలో థియేటర్లకు జరిగిన నష్టాలపై ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం వరకు పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రదర్శనకారులు. ఇవన్నీ కొలిక్కి వచ్చేవరకు ప్రదర్శనల్ని మొదలు పెట్టకూడదని నిర్ణయిస్తే థియేటర్లలో ఇప్పట్లో బొమ్మ పడటం కష్టమేనేమో అనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నాయి సినీ వర్గాలు.
ఓటీటీ కలవరం
థియేటర్లలో ప్రదర్శనల్ని మొదలు పెట్టడానికి తాము సానుకూలంగా ఉన్నామని, కానీ తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమైనా చేయాలి కాబట్టి ఆ పని చేశామని తెలంగాణకి చెందిన ఓ ప్రదర్శనకారుడు 'ఈనాడు సినిమా'తో చెప్పారు. ప్రదర్శన రంగంపై ఓటీటీ ప్రభావం బలంగా పడుతోంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీ వేదికలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో భవిష్యత్తులో థియేటర్ల వైభవం తగ్గే అవకాశం ఉందని ప్రదర్శనకారులు కలవరపడుతున్నారు. ఇలాంటి పోటీ వాతావరణంలో థియేటర్లను తెరవడమే మేలని, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఓటీటీవైపు వెళ్లకుండా థియేటర్లవైపు ఆకర్షించొచ్చనేది ప్రదర్శనకారుల ఆలోచన. ఈ నెల 7న హైదరాబాద్‌లో ప్రదర్శనకారులు మరోమారు సమావేశం కానున్నారు.
ఇది చదవండి: THEATRES NEWS: ఏపీలో థియేటర్లు ఓపెన్.. తెలంగాణలో?