కొంతకాలంపాటు ప్రేమలో ఉన్న బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, నటి దీపికా పదుకొణె విడిపోవడానికి నీతూకపూర్ కారణమని చాలా కాలం క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై నటుడు రణ్‌బీర్ కపూర్ ఒకానొక సందర్భంలో స్పందించాడు. దీపిక, తాను విడిపోవడం అనేది తమ వ్యక్తిగతమని అన్నాడు.
"ప్రతి ఒక్కరికీ తెలుసు నా మొదటి చిత్రం మంచి ఫలితాన్ని ఇవ్వలేదని. కానీ మేము ఎంతో కష్టపడి ఆ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పుడు నేను ఒక నటుడిగా ఇలా ఉన్నానంటే కారణం సంజయ్ లీలా భన్సాలీనే. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేను ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నా. 'సావరియా' వల్ల నేను ఎంతో మంది అభిమానులను పొందాను."
-రణ్‌బీర్ కపూర్, బాలీవుడ్ హీరో
తాను దీపిక నుంచి విడిపోవడానికి తన తల్లి నీతూకపూర్ కారణమంటూ వచ్చిన వార్తలపై రణబీర్ స్పందిస్తూ.. "దీపిక ఎప్పటికీ నా స్నేహితురాలే. మేమిద్దరం విడిపోవడమనేది మా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ప్రేమ అనేది ఇద్దరు మనుషులకు సంబంధించిన విషయమని నేను నమ్ముతాను. మా అమ్మకు నేనంటే ఎంతో ఇష్టం. నా వ్యక్తిగత జీవితంలో ఆమె జోక్యం చేసుకోదు. మా అమ్మకు కూడా దీపిక బాగా నచ్చింది. మేమిద్దరం విడిపోవడానికి మా అమ్మ కారణం కాదని నేను చెప్పాలనుకుంటున్నా." అని రణబీర్ వివరణ ఇచ్చాడు.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'సావరియా' చిత్రంతో వెండితెరకు కథానాయకుడిగా పరిచయమైన రణబీర్.. ఆ తర్వాత 'రాక్‌స్టార్', 'బర్ఫీ', 'యే జవానీ హై దీవానీ', 'తమాషా', 'యే దిల్ హై ముష్కిల్' చిత్రాల్లో నటించాడు.